అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఆశల్లో ముంచింది. ఎన్నికలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నమ్మించారు.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూ.. తాము అధికారంలోకి వస్తే పాత పింఛన్ అమలుతోపాటు అనేక హామీలను ఇచ్చారు. అయితే అధికారంలోకి ఏడాది పూర్తయినా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక్కసారి కూడా దృష్టి సారించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కరువు భత్యం, వేతన సంఘం, ఐఆర్, పెండింగ్ బిల్లులు, పాత పింఛన్ విధానం అమలు వంటివి సమస్యలు చాలా ఉన్నాయి. ఎప్పుడో అమలు చేయాల్సినవి ఇంకా అమలు చేయకపోవడంతోపాటు ప్రస్తుతం అమలు చేయాల్సిన వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమావేశమై ప్రభుత్వంపై అసంతృప్తి బాహాటంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.22,000 కోట్ల బకాయిలు ఇంకా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని, వాటిపై ఎలాంటి ప్రకటన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన ఏడాది పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన తొమ్మిది ముఖ్యమైన హామీల్లో ఒక్కదానిపై కూడా అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు.
కొత్త వేతన సంఘం, ఐఆర్, సకాలంలో జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి అంశాల్లో ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు కాకపోవడం గమనార్హం. పదోన్నతులు, సెలవుల నగదు చెల్లింపులు, డీఏ బకాయిలు వంటి ప్రధాన అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చడం లేదు. పీఆర్సీ కమిషనర్ పదవికి రాజీనామా చేసిన తర్వా కొత్త నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
సీపీఎస్ రద్దుపై ప్రకటన లేకపోగా.. ప్రతిపాదిత జీపీఎస్ పథకాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చేసిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదనే సంకేతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఇచ్చాయి. కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఐఆర్, డీఏ బకాయిలలో కనీసం నాలుగు నెలల వాటిని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
































