“బంగారం బ్యాంక్ లాకర్‌లో పెడితే ఏమొచ్చిద్ది.. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే.. నీకు అవసరానికి ఉపయోగపడతాయి” అంటూ తన ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన మాటలు విన్నాడో అమాయక చక్రవర్తి.
ఆమె చెప్పినట్లుగానే ఏ మాత్రం ఆలోచించకుండా 300 గ్రాములకు పైగా బంగారం తనఖా పెట్టి 2 లక్షల లోన్ తీసుకున్నాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత.. బ్యాంకు లోన్ తీర్చేసి, తన బంగారాన్ని తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. “బంగారం బ్యాంకులో లేదు.. మా ఇంట్లో ఉంది.. ఇంటికే నేరుగా ఇంటికొచ్చేయ్” అని ఆమె చెప్పిన మాటలు విని కాస్త కంగారు పడ్డాడు. పోనీలే ఇంటికెళ్లే.. తీసుకుందాం అనుకుని ఆమె ఇంటికెళ్లగానే.. నువ్వంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ బంగారు ఆభరణాలతో మన పెళ్లికై వడ్డాణం చేయిస్తున్నానని చెప్పడంతో మనోడికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు ఈ యవ్వారమంతా.. ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో జరిగింది.
Also Read ????ఏపీలో దారుణం..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపిన భార్య, ప్రియుడు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం కాగా.. అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో ఉన్న యూనియన్ బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్‌ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకరు అడగ్గా… ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు.
అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభర ణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభర ణాలు విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.