అమెరికాలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భారతీయ విద్యార్థి (NRI) కేసు కీలక మలుపు తిరిగింది. ఆన్‌లైన్ గేమ్‌లో భాగంగా అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి మార్చి 8న ఫ్రీటౌన్‌లోని తన కారులో విగతజీవిగా కనిపించాడు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అతడు బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ ఇంకా లభ్యం కాలేదని చెబుతున్నారు (Blue Whale challenge linked to Indian student’s death in US).
ఎమిటీ బ్లూవేల్ ఛాలెంజ్
బ్లూవేల్ ఛాలెంజ్ అనేది ఓ దారుణ ఆన్‌లైన్ గేమ్. ఇందులో పాల్గొనేవారికి 50 రోజుల్లో 50 ఛాలెంజ్‌లు పూర్తి చేయాలనే టార్గెట్ ఉంటుంది. రానురాను ఛాలెంజ్‌లు మరింత కఠినంగా మారతాయి. చివర్లో గేమర్లు ఆత్మహత్య సవాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దశలో అనేక మంది ఆత్మహత్యాయత్నం చేసి దుర్మణం చెందుతారు. కాగా, శ్వాసతీసుకోవడం ఆపే ప్రయత్నంలో భారతీయ యువకుడు మరణించాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఆన్‌లైన్ గేమ్‌ను నిషేధించాలని భారత్ కొన్నేళ్ల క్రితం భావించింది. కానీ ఈ గేమ్‌తో తీవ్ర ప్రమాదం ఉందంటూ గేమర్లను హెచ్చరిస్తూ ఓ అడ్వైసరీ విడుదల చేసింది. ఈ గేమ్ ఆత్మహత్యకు పురిగొల్పుతున్నట్టు కూడా ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలోని సీక్రెట్ గ్రూప్‌ల మధ్య ఈ గేమ్ షేర్ అవుతూ ఉంటుందని పేర్కొంది.