లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో సామూహిక వివాహ వేడుకకు వరుడు వేళకు రాలేదంటూ వధువు తన బావను పెళ్లి చేసుకుంది. సీఎం సామూహిక వివాహ పథకం కింద కొత్తజంటలకు యూపీ ప్రభుత్వం రూ.51 వేలు చొప్పున ఇస్తోంది. ఈ ప్రయోజనాలు పొందేందుకే అలా చేసినట్లు సమాచారం. ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగిన సీఎం సామూహిక వివాహ కార్యక్రమంలో 132 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఝాన్సీ సమీప బామౌర్‌కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృష్ భానుతో నిశ్చయమైంది. వీరిద్దరి పేరుతో 36 నంబరు రిజిస్ట్రేషను నమోదైంది. పెళ్లిపీటలపై ఖుషీ పక్కన వరుడిగా మరో వ్యక్తి కనిపించాడు. ఆరా తీయగా.. పెళ్లికుమారుడు వేళకు రాలేదని, పెద్దల సలహాతో తాను కూర్చొన్నట్లు నకిలీ వరుడు చెప్పాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతాడని తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు.