రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. వారి ఖాతాల్లో డబ్బులు జమ

భారతదేశంలో అన్నదాతలకు అండగా నిలవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా కృషి చేస్తున్నాయి. దేశంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం సాగుచేసే రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది.


వారు సాగు చేసిన వాటి ద్వారా ప్రభుత్వానికి వచ్చిన లాభాలను కూడా పంచుతున్నాయి.

ఈ రైతులకు ఎన్బీఏ శుభవార్త .. మూడు కోట్ల ఆర్ధిక సాయం

జాతీయ జీవవైవిద్య ప్రాధికార సంస్థ ద్వారా ఈ నిధులను రైతులకు అందిస్తోంది కేంద్రం. ఇక తాజాగా ఏపీలోని నాలుగు జిల్లాల పరిధిలో 198 మంది రైతులకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కలిపి జాతీయ జీవవైవిద్య ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. మూడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వీరికి అందించనుంది. ఈ ఆర్థిక సహాయం రైతుల సరఫరా చేసిన ఎర్రచందనం కలప పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది.

రైతులకు సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర సంస్థ

ఒక్కొక్క రైతు ఎర్రచందనం దిగుబడిని బట్టి 33 వేల నుంచి 22 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉందని జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ వెల్లడించింది. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్ వర్క్ కింద ఈ నిధులను అందిస్తున్నట్టు ఎన్బీఏ పేర్కొంది. ఎర్రచందనం సాగును ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే విధంగా ఈ పథకం రూపొందించబడింది.

ఈ జిల్లాలలోని రైతుల ఖాతాల్లోకి డబ్బులు

ఈ పథకంలో భాగంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎర్రచందనం రైతులు లాభాన్ని పొందుతున్నారు. రైతులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి లభించే నిధులు దీనికి సంబంధించిన పరిశోధనలు, అవగాహన కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. ఎర్రచందనం సాగుకు రైతులను ప్రోత్సహించి, తిరిగి ఎర్రచందనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అందులో వచ్చే లాభాలను కూడా రైతులకు వాటాగా పంచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం.

48 గ్రామాలలో 198 మంది రైతులకు ప్రోత్సాహం

ఈ చర్య రైతులకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా, సహజ వనరులను సంరక్షించడంలో వారి భాగస్వామ్యాన్ని, బాధ్యతను మరింత పెంచుతుంది. ఈ నిధుల ద్వారా రైతులు తమ సాగును మరింత మెరుగుపరుచుకోవడానికి, జీవవైవిద్య పరిరక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలలో ఈ మొత్తాన్ని జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. మొత్తం 48 గ్రామాలలో 198 మంది రైతులకు ఈ మొత్తం అందనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.