ఎంపీలకు జీతాలు, అలవెన్సులు భారీగా పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. అలాగే మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్, ఎక్స్‌ట్రా పెన్షన్ కూడా భారీగా పెంచారు.
ఇప్పటివరకు ఎంపీలకు నెలకు రూ. 1 లక్ష జీతం అందుతోంది. ఇప్పుడు అది 24 శాతం పెంచారు. దీంతో ఇకపై నెలకు రూ. 1,24,000 జీతం రానుంది. అలాగే సిట్టింగ్ ఎంపీలకు ఇప్పటివరకు రోజుకు రూ. 2000 డైలీ అలవెన్స్ అందుతోంది. తాజా పెంపు అనంతరం ఇకపై రూ. 2500 డైలీ అలవెన్స్ రానుంది.
ఇప్పటివరకు మాజీ ఎంపీలకు నెలకు రూ.25000 పెన్షన్ వస్తోంది. తాజా పెంపు అనంతరం రూ. 31,000 పెన్షన్ అందనుంది.
ఐదేళ్లకంటే ఎక్కువ కాలం ఎంపీగా పనిచేసిన వారికి ఎక్కువ సర్వీస్ ఉన్న ప్రతీ ఏడాదికి రూ. 2000 చొప్పున ప్రతీ నెల ఎక్స్‌ట్రా పెన్షన్ చెల్లిస్తారు. ఇకపై ఆ ఎక్స్‌ట్రా పెన్షన్‌ను రూ. 2500 కు పెంచారు.
ఇదే కాకుండా ఎంపీలకు లోక్ సభ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం మరో రూ. 70,000 అదనంగా చెల్లిస్తారు.
ఈ ఏప్రిల్ 1 నుండి ఎంపీల జీతాలు, అలవెన్స్, మాజీ ఎంపీల పెన్షన్, ఎక్స్‌ట్రా పెన్షన్ పెంపు వర్తిస్తుంది.
2018 లో చివరిసారిగా ఎంపీల జీతాలు పెంచారు.
జీతభత్యాలు కాకుండా ఎంపీలకు అదనంగా ఇచ్చేవి
పార్లమెంట్ సమావేశాలకు అందుబాటులో ఉండేలా దేశ రాజధాని ఢిల్లీలో అధికారిక నివాసం. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే బంగ్లాలో ఉండటం ఇష్టం లేని వారు బయట ఉంటూ హౌజ్ రెంట్ అలవెన్స్ తీసుకోవచ్చు.
ప్రతీ సంవత్సరం ఫోన్, ఇంటర్నెట్ ఖర్చులు కేంద్రమే భరిస్తుంది.
ఎంపీలు, వారి కుటుంబానికి కలిపి సంవత్సరానికి 34 సార్లు డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఉచిత ప్రయాణం.
రైలులో లెక్కలేనన్నిసార్లు ఫస్ట్ క్లాస్ టికెట్‌పై ప్రయాణం.
రోడ్డు ద్వారా చేసే ప్రతీ ప్రయాణానికి మైలేజ్ అలవెన్స్.
ప్రతీ సంవత్సరం 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్.
ప్రతీ సంవత్సరం 4,000 లీటర్ల ఉచిత నీటి సరఫరా.