రేషన్ కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు గడువు
కేంద్రాలను పరిశీలించిన డీఎస్‌వో సూర్యప్రకాశ్
నరసన్నపేట, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుల్లో చేర్పులు, మార్పులకు ప్రభుత్వం త్వరలో అవకాశం కల్పించనుంది.
అందుకోసం ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. దీనివలన రేషన్‌లో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సాధారణంగా కార్డుదారుల కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వేలిముద్ర వేసి ప్రతినెలా రేషన్ తీసుకుంటున్నారు. మిగిలిన సభ్యుల్లో కొందరు చదవులు, ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. అటువంటి వారి వేలిముద్రలు అప్‌డేట్ కాలేదు. దీంతో ప్రస్తుతం తెల్లరేషన్ కార్డు ఉన్న కుటంబంలోని అలాంటి సభ్యులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 6,71,803 రేషన్‌కార్డులు ఉండగా 19,39,082 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇప్పటివరకు 17లక్షల మంది ఈకేవైసీ చేయించుకోగా, మరో రెండు లక్షల మంది నమోదు కాలేదు. ప్రస్తుతం డీలర్ల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా డీలర్ల వద్ద కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేలా వెసులుబాటు కల్పించారు. అయితే నెలల తరబడి ఈ-పోస్‌లో వేలిముద్రలు వేయనివారు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, గడువు ఐదు రోజులే ఉండడంతో డీలర్ల వద్దకు కార్డుదారులు పరుగులు పెడుతున్నారు. సర్వర్ సమస్య కారణంగా ప్రక్రియ జాప్యమవుతోంది. ఈకేవైసీ గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు.
త్వరగా పూర్తి చేయాలి :
రేషన్‌కార్డుదారులు ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించుకోవాలని డీఎస్‌వో సూర్యప్రకాష్ తెలిపారు. బుధవారం నరసన్నపేటలోని దేశవానిపేట, భవానీపురంలో ఈకేవైసీ నమోదు చేస్తున్న రేషన్ షాపులను ఆయన పరిశీలించారు. ఈ పక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.