కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా, ఇప్పటికే వాడుతున్న ఫోన్ ను మార్చాలనుకుంటున్నారా. అయితే వెంటనే మార్కెట్ లోకి వెళ్లిపోయి మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేయకండి. ముందుగా వివిధ మోడళ్లు, వాటి ప్రత్యేకతలు, ధరను పరిశీలించండి. ఎందుకంటే దేశ మార్కెట్ లోకి నిత్యం వివిధ కొత్త మోడళ్లు వస్తున్నాయి. ఫీచర్లు, టెక్నాలజీలో సూపర్ అనిపిస్తున్నాయి. కొన్ని మోడళ్లు లేటెస్టు టెక్నాలజీతో తక్కువ ధరకే లభిస్తున్నాయి. అవే ఫీచర్లతో వేరే బ్రాండ్ ఫోన్ ఎక్కువ ధర ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్ లోకి కొత్తగా విడుదలైన ఒప్పో రెనో 14 ప్రో, నథింగ్ ఫోన్ 3 మధ్య తేడాలను తెలుసుకుందాం.
ఒప్పో, నథింగ్ కంపెనీలు ఇటీవల తమ కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి. ఒప్పొ నుంచి రెనో 14 ప్రో, నథింగ్ నుంచి ఫోన్ 3 మార్కెట్ లోకి వచ్చాయి. ఒప్పొ ఫోన్ ధర రూ.50 వేల కంటే తక్కువే, నథింగ్ ఫోన్ 3 సుమారు రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండింటి మధ్య ధరలలో బాాగా వ్యత్సాసం ఉన్నప్పటికీ ఇతర ప్రత్యేకతలు ఈ కింది విధంగా ఉన్నాయి..
డిజైన్
- ఒప్పో రెనో 14 ప్రో దాని పూర్వపు మోడళ్ల మాదిరిగానే ప్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో ముందుకు వచ్చింది. అయితే కొన్ని స్వల్ప మార్పులు తీసుకువచ్చారు. వెనుక కెమెరా మ్యాడ్యూల్, ఫ్రేమ్ లో వంద శాతం రీసైకిల్ చేసిన అల్యూమినియాన్ని వినియోగించారు. వెల్వెట్ గ్లాస్ అనే కొత్త మెటీరియల్ తో వెనుక ప్యానెల్ కు అందం వచ్చింది.
- నథింగ్ ఫోన్ 3 డిజైన్ ఆకట్టుకుంటోంది. కొత్తగా గ్లిఫ్ బటన్ ను జోడించింది. ఇది యాప్ షార్ట్ కట్స్, విజువల్ అలెర్టులు, గేమ్ లు తదితర అంతర్నిర్మిత ఇంటరాక్టివ్ ఫీచర్లకు మద్దతు ఇస్తుంది.
డిస్ ప్లే
- ఒప్పో ఫోన్ లో 6.83 అంగుళాల ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. 1.5కె రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, దీని ప్రత్యేకతలు, ముఖ్యంగా ఈ స్క్రీన్ పూర్తి డీసీఐపీ3 కలర్ రేంజ్ ను కవర్ చేస్తుంది. హెచ్ డీఆర్ 10 ప్లస్ కు మద్దతు ఇవ్వడంతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ కలిగి ఉంది.
- నథింగ్ ఫోన్ 3లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే అమర్చారు. దీని రిఫ్రెష్ రేట్ 30 నుంచి 120 హెచ్ జెడ్ మధ్య ఉంది. పైన తెలిపిన మాదిరిగానే హెచ్ డీఆర్10 ప్లస్ కు మద్దతు, అదే గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణతో తీసుకువచ్చారు.
ప్రాసెసర్
- ఒప్పో రెనో 14 ప్రోలో మీడియా టెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరీజీ, గేమింగ్ కోసం ఏఐ గేమ్ హైలెట్స్, ఆవిరి చాంబర్ టెక్నాలజీ, డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.
- నథింగ్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్ సెట్ తో పనిచేస్తుంది. అయితే దీన్ని ప్రస్తుతం దేశంలో లభించే మధ్య శ్రేణి ఫోన్లలోనూ వినియోగిస్తున్నారు. 12 జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉంది.
బ్యాటరీ
- ఒప్పో ఫోన్ లో 6200 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఇది 80 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్స్ వైర్ లెస్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
- నథింగ్ ఫోన్ 3లో 5500 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఇది 65 వాట్స్ ఫాస్ట్ వైర్డ్, 15 వాట్స్ వైర్ లెస్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
కెమెరా, ధర
- ఒప్పో ఫోన్ నాలుగు 50 ఎంపీ సెన్సార్లతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏలో ట్రిపుల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంది.
- ఒప్పో రెనో 14 ప్రో ఫోన్ కు సంబంధించి 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ వేరియంట్ రూ.49,999, అలాగే 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.54,999కు అందుబాటులో ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ మోడల్ రూ.79,999, అలాగే 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ మోడల్ రూ.89,999 నుంచి ప్రారంభమవుతుంది.
































