విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ…బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ, కాత్యాయనీ, మహాలక్ష్మి , లలితా దేవి, చండీదేవిగా దర్శనమిచ్చింది.
ఎనిమిదో రోజైన సెప్టెంబర్ 29 సోమవారం సరస్వతి అలంకారంలో దర్శనమిస్తోంది.
మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. సెప్టెంబర్ 28 ఆదివారం అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో ఉన్నారు. మూల సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే సకల విద్యలలో విజయం సాధిస్తారని భక్తుల విశ్వాసం.
ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ వతీ ధీనా మవిత్రయవతు
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దేవేరి సరస్వతీ మాత. వేదాలు , పురాణాల్లో సరస్వతీ దేవి గురించి ఉంటుంది. శరన్నవాత్రులు, వసంత పంచమి సమయంలో సరస్వతీదేవి ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది. దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతీదేవిని కూడా బ్రహ్మే సృష్టించాడని..సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వపై ఆమెను ధరించాడని ఓ కథనం. సరస్వతీ దేవి కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించే దేవత కాదు సర్వ శక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతంలో ఉంది . ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మని దర్శించుకుంటే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
వాక్కు , బుద్ధి , వికాసం, విద్య, వివేకం , కళలు , విజ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి.
జ్ఞాన ప్రదాత అయిన సరస్వతి గురించి ఎన్నో పురాణకథలున్నాయి.
ఓసారి సనత్కుమారుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమని అడిగితే ముందుగా సరస్వతి దేవిని స్తుతించిన తర్వాత బ్రహ్మజ్ఞాన సిద్థాంతాన్ని చెప్పారట.
జ్ఞానాన్ని ఉపదేశించమని భూదేవి అనంతుడిని అడిగిందట.. అప్పుడు కశ్యపుడి ఆజ్ఞతో సరస్వతిని స్తుతించిన తర్వాత నిర్మలమైన జ్ఞానాన్ని భూదేవికి వివరించాడు.
సరస్వతీ దేవిని స్తుతించిన తర్వాత వాల్మీక మహర్షి పురాణసూత్ర జ్ఞానాన్ని సముపార్జించారు.
వ్యాసమహర్షి నూరేళ్లపాటూ పుష్కర తీర్థంలో సరస్వతీదేవి గురించి తపస్సు ఆచరించి వరాలు పొందిన తర్వాతే వేదాలు రచించారు
సరస్వతి దేవి శక్తి ప్రభావంతోనే ఇంద్రుడికి తత్వజ్ఞనా ప్రభావంతోనే పరమేశ్వరుు ఇంద్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడని చెబుతారు
విద్య నేర్పించిన గురువు ఆగ్రహానికి గురైన యాజ్ఞవల్క్య మహర్షి తాను నేర్చుకున్న విద్యను మర్చిపోయాడు. ఆ తర్వాత సూర్యభగవానుడి గురించి తపస్సు చేయగా..ప్రత్యక్షమైన ఆదిత్య భగవానుడు సరస్వతీ దేవిని ప్రార్థించమని చెప్పాడు. అలా సరస్వతిని ప్రార్థించి కోల్పోయిన జ్ఞాపకశక్తిని సరస్వతీ ప్రార్థన అనంతరం తిరిగి పొందాడు యాజ్ఞవల్క్య మహర్షి
సరస్వతి అలంకారం రోజు దద్ధ్యోజనం, పాయసం, తీపి పదార్థాలు నివేదిస్తారు
ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు
తెల్లటి కలువ పూలతో పూజ చేస్తారు
సరస్వతీ అష్టోత్తరం, సరస్వతీ దేవి స్త్రోత్రాలు పారాయణం చేయడం మంచిది.































