అమ్మాయిలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక మీ దగ్గర్లోనే ఎగ్జామ్ సెంటర్స్!

రాష్ట్రంలో రాబోయే నెలల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మేలో నిర్వహించే ఎడ్‌సెట్, ఎప్‌సెట్, ఐసెట్‌ వంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అమ్మాయిలకు పరీక్షా కేంద్రాలను అందుబాటులో ఉండేలా కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో రాబోయే నెలల్లో నిర్వహించబోయే ప్రవేశ పరీక్ష విషయంలో ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే యువతులకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రవేశ పరీక్షల కన్విన్లర్లతో సమావేశం అయిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి ఈ విషయంపై చర్చించారు. సాధారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్ట్‌లలో నిర్వహిస్తున్నారు.


ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యం

అయితే మధ్యాహ్నం షిప్ట్‌లో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అమ్మాయిలకు పరీక్ష కేంద్రాలు సిటీకి దూరంగా ఉండడం వల్ల తిరిగి ఇంటికి వెళ్లేందుకు చికటి పడిపోతుంది. దీంతో మొదట వారిని ఉదయం షిప్ట్‌లో వేయాలని ఆలోచించారు. కానీ ఆన్‌లైన్‌ పరీక్షల వల్ల నార్మలైజేషన్‌ సమస్య కారణంగా సాధ్యం కాదనే వెనక్కి తగ్గారు.

50 శాతం మంది అమ్మాయిలే

అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో సెంటర్లను అప్లై చేసుకునే వారికి హైదరాబాద్‌ సిటీలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించడం ద్వారా వారికి కాస్తైనా వెసులుబాటు కలుగుతుందని ఆలోచనకు వచ్చారు. రాష్ట్రంలో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్ రాసే వారిలో సుమారు 50శాతం వరకు అమ్మాయిలే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉన్నత విద్యాశాఖ మండలి ఛైర్మన్ తెలిపారు. అలాగే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రవేశ పరీక్షల కన్వినర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.