వరంగల్లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భద్రకాళి అమ్మవారి ఆలయం మాడవీధుల నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా పచ్చ జెండా ఊపింది.
20 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, చారిత్రక భద్రకాళి దేవస్థానం అభివృద్ధి పనులలో వేగం పుంజుకుంది.
20కోట్ల రూపాయలను అభివృద్ధికి కేటాయించిన ప్రభుత్వం
ఆలయ అభివృద్ధి మరియు మాడవీధులు నిర్మాణం కోసం మొత్తం 30కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 20కోట్ల రూపాయలను కేటాయించింది. భద్రకాళి ఆలయ అభివృద్ధికి కుడా మరో 10కోట్ల రూపాయలను సమకూర్చనుంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
సుమారు 1.5కిలోమీటర్ల మేర విశాలమైన మాడ వీధుల నిర్మాణం
ప్రస్తుతం ప్రభుత్వ నిధులను కేటాయించడంతో పనులలో వేగం పెరగనుంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 1.5కిలోమీటర్ల మేర విశాలమైన మాడ వీధులను నిర్మించనున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ లోనే ప్రాథమికంగా పనులు ప్రారంభం కాగా సుమారు 8కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి చెరువు పంప్ హౌస్ ఆధునీకరణ శ్రీ వల్లభ గణపతి ఆలయం సమీప పనులు కాపువాడ చెరువు మట్టితో పల్లపు ప్రాంతాలను నింపే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు.
మాడ వీధుల నిర్మాణం ఇలా
మాడ వీధుల నిర్మాణంలో భాగంగా చెరువు లోపలి వైపు రాతి కట్టడాన్ని చేయనున్నారు. గ్రానైట్ ఫ్లోరింగ్, గ్రీనరీకి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేయనున్నారు. భద్రకాళి అమ్మవారి ఉత్సవ ఊరేగింపులకు నాలుగు మాడ వీధులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా వీటిని తీర్చిదిద్దనున్నారు.
మూడు నెలలు నిలిచిపోయిన పనులలో మళ్లీ వేగం
ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పనుల కోసం అధికారుల త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ క్రమంలో మూడు నెలలు నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. ఓరుగల్లు పర్యాటక రంగంలో భద్రకాళి ఆలయానికి ఉన్న ప్రత్యేకమైన స్థానం నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి కట్టుబడి నిధులను మంజూరు చేస్తోంది.



































