అదరగొడుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ వృద్ధి.. పెట్టుబడిదారులకు పండగే.

www.mannamweb.com


భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ జూలైలో అత్యధికంగా రూ. 23,332 కోట్ల ఎస్ఐపీల ఇన్‌ఫ్లోను సాధించిందని ఇటీవల ఓ నివేదిక వెల్లడింది.

ఈ ఇన్‌ఫ్లో జూన్‌లో రూ. 21,262 కోట్లుగా ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల ఇన్‌ఫ్లో ఇటీవలి పెరుగుదల కారణంగా మొత్తం మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఆస్తులు (ఏయూఎం) జూన్‌లో 60.89 లక్షల కోట్ల నుంచి జూలైలో 64.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా ప్రకారం గత నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి మొత్తం ఇన్‌ఫ్లోలు 8.6 శాతం క్షీణించి రూ. 37,113.4 కోట్లకు చేరాయి. ఇది జూన్‌లో రూ. 40,608.19 కోట్లు ఉండగా, మ్యూచువల్ ఫండ్‌లలో ఈక్విటీ ఇన్‌ఫ్లో నమోదైన అత్యధికంగా మారింది.

ఓపెన్-ఎండ్ ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు 41 నెలలుగా సజావుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జూలైలో సెన్సెక్స్ 3.43 శాతం, నిఫ్టీ 3.92 శాతం పెరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో నిరంతరం పెట్టుబడులు పెట్టడం వల్ల పరిశ్రమ వృద్ధి రేటు సానుకూలంగా ఉందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ పెట్టుబడిదారుల ఆర్థిక వ్యూహంలో మ్యూచువల్ ఫండ్స్ ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. సెక్టోరల్ మరియు థీమాటిక్ ఫండ్స్‌లో గరిష్ట పెట్టుబడి కనిపిస్తోంది. జూలైలో ఈ విభాగంలో రూ.18,386.35 కోట్ల నికర పెట్టుబడి వచ్చింది. జూలైలో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.1,19,587.60 కోట్ల నికర ఇన్‌ఫ్లో కూడా ఉంది. దీనికి విరుద్ధంగా జూన్‌లో రూ.1,07,357.62 కోట్ల నికర రాబడి నమోదైంది.

స్వల్పకాలిక లిక్విడ్ ఫండ్ కేటగిరీలో రూ.70,060.88 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లో రూ.28,738.03 కోట్ల నికర ఇన్‌ఫ్లో ఉంది. జూలై పూర్తి నెలలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ, డెట్‌లో రూ. 54,727 కోట్లను రాబట్టాయి. ఎన్‌ఎస్‌డిఎల్ డేటా ప్రకారం జూలైలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలో రూ.32,364 కోట్లు, డెట్‌లో రూ.22,363 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎఫ్‌పీఐ కార్యకలాపాలు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, డాలర్ ఇండెక్స్, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సంఘటనల వల్ల ప్రభావితమవుతాయి.