ఇండ్ల మధ్యనే వెలుస్తున్న ఓయోలు..

నగరంలో ఎక్కడ చూసినా ఓయో రూమ్స్ పుట్టుకువచ్చాయి. చిన్నా, పెద్ద గల్లీలు అనే తేడా లేదు. ఒక్కోచోట పదుల సంఖ్యలో ఓయోలు వెలుస్తున్నాయి.


ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో ఓయోలతో పాటు కో లీవింగ్ కేంద్రాలు, పీజీలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, కనీస సదుపాయాలు లేకుండానే, కాలనీల్లో ఇళ్ల మధ్యనే ఇలాంటివి ప్రారంభించేస్తున్నారు. పోలీసులు దృష్టి పెట్టక పోవడంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ఆయా కాలనీల్లోని ఓయోలు, కొలీవింగ్ సెంటర్స్ అక్కడి స్థానికులకు తల నొప్పిగా మారాయి. ఎప్పుడు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు స్థానికులు. ఇలాంటివి మా కాలనీల్లో వద్దు బాబోయ్ అంటూ రోడెక్కుతున్నారు.

రూపం మార్చుకున్న లాడ్జీలు..

ఒకప్పుడు లాడ్జీలకు వెళ్తున్నారు అంటేనే జనాలు అదోలా చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒకప్పటి లాడ్జిలు.. ఇప్పుడు రూపం మార్చుకుని ఓయో రూమ్స్‌ గా రూపాంతరం చెందాయి. చాలామంది యూత్‌ కు అదో ఫేవరేట్ ప్లేస్‌గా మారిపోయాయి. లాడ్జీల మాదిరిగా మన డిటెల్స్ ఏమీ ఇవ్వనవసరం లేదు. జస్ట్ ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు.. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆన్ లైన్ లోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఓయోలో ఎవరైనా ఉండొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చు.. ఆడా-మగా.. రూమ్‌లో ఇష్టం వచ్చినట్టు గడపొచ్చు. అందుకే, యూత్ ఏకాంతంగా గడపడానికి బెస్ట్ లొకేషన్‌గా మారుతున్నాయి ఓయో రూమ్స్‌.

వీటితో పాటు కో లివింగ్ కూడా వచ్చేశాయి. ఇక్కడ కూడా అంతే ఆమె ఎవరు..? అతను ఎవరు.? ఆమె నీకు ఏమవుతుంది? మీ ఇద్దరి రిలేషన్ షిప్ ఏంటి..? ఇలాంటి కప్రశ్నలకు ఆస్కారం లేదు. పోలీసులు అస్సలు అడుగుపెట్టరు. వీటితో పాటు పీజీ అంటే పేయింగ్ గెస్ట్ లంటూ కొత్త ట్రెండ్ కూడా నడుస్తుంది. అందుకే ఇప్పుడు ఎవరూ పార్కులు, ఫ్రెండ్స్ రూమ్స్‌, లాడ్జిలు అనే మాట మర్చిపోయారు. కాలేజ్ లవర్స్‌, ఇల్లీగల్ ఎఫైర్స్ అన్నీ ఇప్పుడు ఓయో, కో లీవింగ్ రూమ్స్‌కు షిఫ్ట్ అవుతున్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉండటం. ఎలాంటి ప్రశ్నలు అడగకపోవడంతో అవే బెటర్ అని ఫీల్ అవుతున్నారు జనాలు. అయితే అలాంటివి మా కాలనీల్లో వద్దంటే వద్దు అంటున్నారు ఆయా కాలనీల ప్రజలు. వాటిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అనేక ఆరోపణలు, తీవ్ర విమర్శలు..

ఓయో రూమ్స్‌, కొలీవింగ్ లలో జరుగుతున్న యవ్వారాలపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరిని తీసుకువస్తున్నారు అనే సమాచారం కూడా సేకరించకుండా ఎవరికి పడితే వారికి ఓయోలలోకి అనుమతులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంతేకాదు. అసాంఘీక కార్యక్రమాలకు ఓయోలు, కో లీవింగ్ కేంద్రాలు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాడ్జీలపై రైడ్స్ చేస్తారు కానీ ఓయో రూమ్స్‌ను ఎందుకు తనిఖీలు చేయారంటూ పోలీసులను మహిళా సంఘాలు ఎప్పటి నుండో ప్రశ్నిస్తున్నాయి. అయినా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదనే చెప్పాలి. అయితే గతంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ ఓయో రూమ్స్ వ్యవహారంపై స్పందించారు. ఓయో, లాడ్జ్‌ల వ్యాపారాలకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన వాటి నిర్వహణ తీరు బాగోలేదన్నారు. ఎవరికి రూం ఇస్తున్నారో, ఎవరు రూంలలో ఉంటున్నారో సరిగ్గా చెక్ చేయట్లేదన్నారు. ఆన్‌ లైన్ బుకింగ్‌లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓయో, లాడ్జ్‌ లలో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా ఉండట్లేదన్నారు. ఓయో రూమ్స్, లాడ్జ్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ నిర్వాహకులకు సూచించారు.

ఇండ్ల మధ్య ఓయో రూమ్స్, కో లీవింగ్ కేంద్రాలు వద్దు..

మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఒక్కో చోట రెండు మూడు ఓయో రూమ్ లు, కో లీవింగ్ సెంటర్లు ఉంటున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే, కనీస సదుపాయాలు కూడా కల్పించకుండానే జనావాసాల మధ్య వీటిని నడుపుతున్నారు. చాలా ఓయో రూమ్స్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక కొలీవింగ్ కేంద్రాల్లో అయితే ఎవరు ఎవరితో సహజీవనం చేస్తున్నారు.

వారి రిలేషన్ ఏంటో కూడా కనీసం నిర్వాహకులకు కూడా తెలియని పరిస్థితి. డబ్బులు వచ్చాయా లేదా అని చూస్తున్నారే కానీ మిగతా విషయాలు ఏవీ పట్టించుకోవడం లేదు. అటు పోలీసులు కూడా మిన్నకుండి చోద్యం చూస్తున్నారు. అయితే కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ వాసులు, గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ ప్రజలు ఓయోలు, కో లీవింగ్ కేంద్రాలను తమ కాలనీలలో ఏర్పాటు చేయొద్దని నిరసన వ్యక్తం చేశారు. ఆయా కాలనీల ప్రజలు సైతం వీటిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.