ఈ రైలు మొత్తం ఎనిమిది రోజులు నిరంతరంగా ప్రయాణికులను తీసుకెళ్లడం విశేషం. దాదాపు 10,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రయాణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
మనలో చాలా మంది రైలు ప్రయాణం చేశాం. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద రైలు ప్రయాణం ఎప్పుడైనా చేశారా? అసలు అది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? అయితే పదండి తెలుసుకుందాం… ఈ రైలు మొత్తం ఎనిమిది రోజులు నిరంతరంగా ప్రయాణికులను తీసుకెళ్లడం విశేషం. దాదాపు 10,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రయాణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
రష్యా రాజధాని మాస్కో నుండి ఉత్తర కొరియాలోని ప్యాంగ్యాంగ్ వరకు ఈ ట్రైయిన్ జర్నీ ఉంటుంది. ఈ రైలు ప్రయాణం కేవలం దూరం పరంగా కాకుండా, మార్గం పరంగా కూడా అత్యంత విశేషమైనది. మంచుతో కప్పుకున్న పర్వతాలు, అనంతంగా వ్యాపించిన మైదానాలు, లోతైన అటవులు, అరుదుగా కనిపించే గ్రామాలు—అన్నీ కలిసి ప్రయాణికులకు అసాధారణ అనుభవం కలిగిస్తాయి. చివరకు ఈ రైలు ప్రపంచంలో అత్యంత రహస్యంగా, కఠిన నియంత్రణల్లో నడిచే దేశంగా పేరుగాంచిన ఉత్తర కొరియా సరిహద్దుకు చేరుకుంటుంది.
ఇది సాధారణ రైలు మార్గం కానే కాదు. ఈ ప్రయాణం పెద్ద భాగం ప్రపంచ ప్రసిద్ధ ట్రాన్స్–సైబీరియన్ రైల్వే పై జరుగుతుంది. 9,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ లైన్ రష్యాలోని మాస్కో నుండి వ్లాడివొస్టక్ వరకు సాగుతుంది. అక్కడికి చేరిన తర్వాత ప్రత్యేక ఉత్తర కొరియా బోగీని మరో రైలుతో జత చేసి ప్యాంగ్యాంగ్ వైపు పంపుతారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సేవ 2020లో నిలిపివేయబడినప్పటికీ, రష్యా–ఉత్తర కొరియా సంబంధాలు మెరుగుపడటం వల్ల మళ్లీ పునరుద్ధరించబడింది.
ఎనిమిది రోజుల ప్రయాణం అనేది చాలామందికి సాహసమే. గతంలో ఈ మార్గంలో ప్రయాణించిన కొందరు ప్రయాణికుల అనుభవాలు చాలా విభిన్నంగా ఉండేవి. తీవ్ర చలిలో హీట్ సిస్టమ్ పనిచేయకపోవడం, బోగీలో తగిన మౌలిక వసతులు లేకపోవడం వంటి ఇబ్బందులను వారు వివరించారు. దాదాపు ప్రతి బోగీలో నీటిని మరిగించే చిన్న కేత్లీ మాత్రమే సరిగ్గా పనిచేసినట్లు వారు తెలిపారు. దీంతో టీ, కాఫీ, ప్యాక్ నూడుల్స్ వంటి తేలికపాటి ఆహారమే ప్రయాణంలో అందుబాటులో ఉండేది.
ఉత్తర కొరియా ప్రపంచంలో అత్యంత క్లోజ్‌డ్ దేశాలలో ఒకటి. ఇక్కడ ప్రజల జీవితం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. విదేశీ సమాచారాన్ని చూడడం, ప్రభుత్వ విధానాలపై మాట్లాడడం వంటి చిన్న కారణాలకు కూడా కఠిన శిక్షలు ఉండటం సాధారణం. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం దేశ జనాభాలో 40% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.ఈ నేపథ్యంలో మాస్కోప్యాంగ్యాంగ్ ట్రైన్ ప్రయాణం సాహసం, ఉద్వేగం, అనిశ్చితి కలగలిపిన అరుదైన అనుభవంగా అభివర్ణించబడుతోంది. ఇది ప్రపంచంలో అతి పొడవైన రైలు ప్రయాణం మాత్రమే కాకుండా, అత్యంత రహస్యమైన గమ్యానికి వెళ్లించే ప్రత్యేక మార్గం కూడా.
































