ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప.. కిలో ఆలూ ధరతో కాసు బంగారం కొనచ్చు ఈజీగా

www.mannamweb.com


బంగాళదుంపలు సాధారణంగా చౌకైన కూరగాయగా పరిగణించబడతాయి. అయితే ఈ స్పెషల్ బంగాళదుంప ధర కిలో 40 నుంచి 50 వేల రూపాయలు! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపగా ప్రసిద్దిగాంచింది.

మనం మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా బంగాళదుంప కోసం వెదుకుతారు. అయితే ఈ వెరైటీ బంగాళదుంప మాత్రం అరుదుగా దొరుకుంతుంది. దీని పేరు లే బోనొట్టె బంగాళదుంప. ఫ్రెంచ్ ద్వీపం ఐల్ డి నోయిర్‌మౌటియర్‌లో మాత్రమే దీనిని సాగు చేస్తారు.

ఈ అరుదైన జాతి బంగాళాదుంప దీని ప్రత్యేక సాగు పద్ధతి, అసాధారణమైన రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ బంగాళదుంప ఆ ఫ్రెంచ్ ద్వీపంలో 50 చదరపు మీటర్ల ఇసుక నేలలో మాత్రమే పెరుగుతుంది. దాని సాగులో ఆల్గే, సముద్ర మొక్కలను సహజ ఎరువులుగా ఉపయోగిస్తారు. ఫలితంగా ఉప్పు, నిమ్మకాయ రుచితో ఉన్న పులుపు, తేలికపాటి వగరు కలయికతో ఈ బంగాళాదుంపకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

అంతేకాకుండా ఈ బంగాళాదుంపలను ఒకొక్కటిగా చాలా జాగ్రత్తగా చేతితో తీస్తారు. దీని అధిక ధరకు ఇది కూడా ఒక కారణం. బంగాళాదుంపలను కోయడానికి ఏడు రోజులు వ్యవధి మాత్రమే ఉంటుంది. దాదాపు 2,500 మంది కార్మికులు ఆ తక్కువ సమయంలో మొత్తం బంగాళదుంపలను భూమి నుంచి జాగ్రత్తగా తవ్వి తీస్తారు.

ఈ బంగాళదుంప సంవత్సరంలో 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ ఫ్రెంచ్ ద్వీపంలో మొత్తం 10,000 టన్నుల బంగాళదుంపలు పండిస్తారు. ఇందులో 100 టన్నుల లే బోనొట్టె బంగాళదుంపలు మాత్రమే సాగు చేస్తున్నారు.

స్థానిక నేల, సముద్రపు నీటి సుగంధాలు లే బోనొట్టె బంగాళాదుంపల తొక్కలలోకి శోషించబడతాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అందుకనే దీనికి ప్రత్యేకమైన రుచి ఉన్న అనుభూతిని ఇస్తుంది. కనుక ఈ బంగాళదుంపల పూర్తి రుచిని ఆస్వాదించాలంటే ఈ బంగాళదుంపలను తొక్కతో తినాలి.

ఈ బంగాళాదుంపను ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులు, చెఫ్‌లలో రుచికరమైనవిగా పిలుస్తారు. ఈ బంగాళాదుంప అరుదైన, అసాధారణమైన రుచి.. తినే ఆహారానికి లగ్జరీ లుక్ ని ఇస్తుంది.

లే బోనొట్టె బంగాళాదుంపకు ప్రపంచంలోనే అధిక డిమాండ్ ఉన్నా.. సరఫరాలో పరిమితి ఉన్న కారణంగా.. ఈ లే బోనొట్టె బంగాళదుంపలు సాధారణంగా మార్కెట్లో విక్రయించబడవు. వీటిని వేలం వేసి అమ్ముతారు.