హిందూ సంప్రదాయంలో ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. కానీ కొన్ని క్షేత్రాలు మాత్రం భక్తి, చరిత్ర, పురాణం, వాస్తుకళతో పాటు ఆధునిక కాలపు నమ్మకాల్ని కూడా మోస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాయి.
అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటిగా శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం నిలుస్తోంది. భక్తుల విశ్వాసంతో పాటు సినీ పరిశ్రమ ఆశీస్సులు పొందిన ఆలయంగా ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
హైదరాబాద్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ బస్‌స్టాప్ నుంచి 5 కిలోమీటర్లలోపు ఉన్న అమ్మపల్లి గ్రామంలో ఈ పురాతన రామాలయం కొలువై ఉంది. 13వ శతాబ్దంలో వేంగి రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. ఏడు అంతస్థుల భారీ రాజగోపురం, దాని ద్వారంపై శేషతల్పసాయిగా దర్శనమిచ్చే విష్ణుమూర్తి విగ్రహం దర్శనమాత్రమే భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
సీతారామ లక్ష్మణ సమేతంగా కొలువై ఉన్న ఈ ఆలయం విస్తీర్ణం దాదాపు 9 ఎకరాలు. చుట్టూ పొడవాటి ప్రాకారాలు, మకర తోరణం, పచ్చని కొబ్బరి చెట్లు, పురాతన కోనేరు.. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక ప్రశాంతతను వెదజల్లుతుంది. ముఖ్యంగా ఇక్కడి కోదండ రాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుడిచేతిలో బాణాలు, ఎడమచేతిలో విల్లు పట్టుకున్న శ్రీరాముడు వనవాస కాలంలో సంచరించిన క్షేత్రాల్లోనే ఇలాంటి ఆలయాలు ఉంటాయన్న పురాణ విశ్వాసం ఈ క్షేత్రానికి మరింత ప్రాశస్త్యం తెచ్చింది.
ఇంకొక విశేషం ఏమిటంటే.. సాధారణంగా గర్భగుడిలో దర్శనమిచ్చే ఆంజనేయుడు ఇక్కడ మాత్రం శ్రీరాముడికి ఎదురుగా ధ్వజస్తంభం వద్ద కొలువై ఉంటాడు. రాముడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో హనుమంతుడిని ఇంకా కలవలేదన్న కథనం దీనికి నేపథ్యంగా చెబుతారు. ఆలయ ముఖమంటపంలో ఉన్న కూర్మావతార శిల్పం దర్శనం మోక్షప్రదమని భక్తుల నమ్మకం.
సీతమ్మవారు ఇక్కడ సంతానప్రదాయినిగా పూజలు అందుకుంటున్నారు. పెళ్లి ఆలస్యమవుతోందనో, సంతానం కోసం ఎదురుచూస్తున్నామనో భక్తులు ఈ ఆలయాన్ని ఆశ్రయిస్తే కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. సీతమ్మవారు కొలువై ఉండటంతోనే ఈ గ్రామానికి “అమ్మపల్లి” అనే పేరు వచ్చిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది.
భక్తితో పాటు ఆధునిక కాలంలో ఈ ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది సినిమా రంగమే. టాలీవుడ్‌లో ఈ ఆలయాన్ని ‘సినిమా గుడి’గా పిలుస్తారు. ఇక్కడ షూటింగ్ చేసిన సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం సినీ వర్గాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా ‘మురారి’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ ఆలయం షూటింగ్‌లకు హాట్‌స్పాట్‌గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ తీస్తే విజయం ఖాయమన్న నమ్మకంతో ఎన్నో సినిమాలు ఈ ఆలయ ప్రాంగణాన్ని ఎంచుకున్నాయి.
అంతేకాదు.. ఇక్కడ జరిగే వివాహాలు ఎంతో పుణ్యఫలితాన్ని ఇస్తాయన్న నమ్మకంతో అనేక కుటుంబాలు అమ్మపల్లి సీతారాముల సన్నిధిలో వివాహ బంధానికి అడుగుపెడుతున్నాయి. భక్తి, పురాణం, సినిమా, పెళ్లి.. అన్నింటినీ ఒకే చోట మేళవించిన అరుదైన ఆలయంగా అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం నేడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.



































