జాతీయ పార్కును.. ప్లాట్లు చేసి అమ్మేశారు!

రిపబ్లిక్ ​డే వేడుకల వేళ.. ఎల్బీనగర్ ​నియోజకవర్గంలోని మన్సూరాబాద్​లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​, విజయవాడ హైవేను ఆనుకుని ఉన్న ‘హరిణి వనస్థలి’ జాతీయ పార్కు భూములను యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మేసినట్లు తెలిసింది.


అక్రమార్కులు రిపబ్లిక్​డే వేడుకల మాటున పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రిపబ్లిక్​డే వేడుకలు రసాభాసాగా మారి ఉద్రిక్తతకు దారి తీసింది. పలువురిని పోలీసులు అరెస్టు​ చేసి పోలీస్​ స్టేషన్కు తరలించారు. వేల కోట్ల విలువైన 582 ఎకరాల జాతీయ పార్కు భూమిని అలవోకగా.. ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు కట్టబెట్టడం వెనుక గత ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీంతో బాధ్యులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్​ వ్యక్తమవుతోంది.

అసలు విషయం..

రంగారెడ్డి జిల్లా .. సరూర్​నగర్​ మండలం .. మన్సూరాబాద్​ గ్రామంలో రాష్ట్ర అటవీ శాఖ చెందిన 4వేల ఎకరాల్లో 1994 లో ‘హరిణి వనస్థలి’ జింకల పార్క్​ను నిర్మించారు. అనంతరం జాతీయ పార్క్​ హోదా కల్పించారు. 1996లో ప్రహరీ నిర్మించే నాటికే అందులోని 2,400 ఎకరాల భూమి మాదేనంటూ కోర్టుకు వెళ్లారు. ‘ 1947లో అప్పటి పాలకులు మన్సూరాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 7లోని 2400 ఎకరాల భూమికి హంసీబాయిని సంరక్షకురాలిగా నియమించారని, 1954లో, ఆమె ఆ భూమిని అటవీశాఖకు (మహావీర్ హరిణి వనస్థలి పార్క్) 20 ఏండ్ల కాలానికి, అంటే 1973 వరకు లీజ్ కు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. హంసీబాయి మరణం తరువాత, వారి వారసులు ఆ భూమిని 50 వేల మంది పేదలకు దానం చేశారని కోర్టుకు విన్నవించారు. కానీ కోర్టు అది అటవీశాఖకు చెందిన భూమిగా తేల్చింది.

తప్పుడు పత్రాలు సృష్టించి…

2019 లో యూసఫ్​ ఖాన్​, వాసం తులసమ్మ అలియాస్​ సుల్తానా పేరుపై సర్వే నెం 7లోని 2400 ఎకరాలు తమవేనంటూ నెల్లూరుకు చెందిన అడ్వకేట్​షేక్​​జిలానీ మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని , వీటిపై పూర్తి హక్కుదారులం తామేనంటూ వారు పేర్కొన్నారు. అలా వీటిలోని కొంత భూమి చొప్పున అమ్మకానికి పెడుతున్న స్టాంప్ పత్రాలు సృష్టించారు. అప్పటి నుంచి పార్కు స్థలాన్ని 100, 90 గజాలు, 60 గజాలు చొప్పున ప్లాట్లు చేశారు. సదరు ప్లాట్లను 40 నుంచి 50 వేల రూపాయలకే అమ్ముతూ వచ్చారు.

పూటకు లేకున్నా పుస్తెలమ్మి కొన్నారు..

90 గజాల స్థలం రూ.35 వేలకు వస్తుండడం, అది మహ్మదీయులు పేదలకు ఇచ్చారని.. బురిడీ కొట్టించే మాటలు చెప్పడంతో చాలా మంది పేదలు కొనుగోలు చేశారు. తక్కువ ధరకే స్థలం వస్తుందని వేల మంది అందులో స్థలాలను కొనుగోలు చేయగా, ఇలా రెండు, మూడేళ్లలోనే సుమారు యాభై వేల ప్లాట్లు విక్రయించినట్లు తెలుస్తోంది.

రిపబ్లిక్​డే రోజు పొజిషన్​చూపుతామని..

ప్లాట్లు కొన్న వాళ్లకు ప్లాట్లు ఇస్తానని చెప్పి సర్వే నెంబర్​7 దగ్గరకు రావాలని అడ్వకేట్​ఎస్కే జిలానీ కొనుగోలు దారుల్ని నమ్మించారు. సోషల్​మీడియాలో శనివారం ఓ వీడియో పోస్ట్​చేశాడు. దీంతో కొనుగోలు దారులు పార్కు వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ముందస్తుగానే పోలీసులు మోహరించడం తో కొనుగోలు దారులను పార్కులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అసలు విషయం తెలిసి మోసపోయామని కొనుగోలు దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కొందరు ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్​చేసి పీఎస్​లకు తరలించారు. అయితే సోషల్​మీడియాలో వీడియో రంగారెడ్డి డీఎఫ్​వో దృష్టికి వెళ్లడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ముందస్తుగానే సదరు అడ్వకేట్, అమ్మినవారిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎలాంటి ఫిర్యాదు రాలేదు..

ఈ ప్లాట్లు కొనుగోలులో మోసపోయామని బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని వనస్థలిపురం సీఐ శ్రీనివాస్​గౌడ్​తెలిపారు. పార్కు వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో మొత్తం 84 మందిని అరెస్ట్ చేసి వనస్థలిపురం, హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్​స్టేషన్లకు తరలించినట్లు ఆయన​తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.