కొత్త ‘పంబన్’ బ్రిడ్జ్.. ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం

www.mannamweb.com


తమిళనాడులోని రామేశ్వరంలో చారిత్రక ‘పంబన్ బ్రిడ్జి’ శిధిలావస్ధకు చేరడంతో.. దాని స్ధానంలో కొత్త బ్రిడ్జిని అదే పేరుతో తాజాగా నిర్మించారు.

ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే పంబన్ బ్రిడ్జిని అదే తరహాలో నిర్మించారు. సరికొత్త హంగులతో నిర్మితమైన కొత్త పంబన్ బ్రిడ్జి కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొత్త బ్రిడ్జికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మంత్రముగ్దులయ్యారు. తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫొటోను అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

పంబన్ బ్రిడ్జి ఫొటో షేర్ చేసి.. ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ‘1914లో నిర్మించిన పాత పంబన్ బ్రిడ్జి 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. ఇది శిధిలావస్ధకు వచ్చిన నేపథ్యంలో దాని సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్‌ బ్రిడ్జ్‌ను ప్రభుత్వం నిర్మించింది. దీనిని వేగం, భద్రత కోసం డిజైన్ చేశారు’ అని రైల్వే మంత్రి రాసుకొచ్చారు. త్వరలోనే ఈ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ఇదే.

కొత్త బ్రిడ్జి రాకతో 105 ఏళ్ల చరిత్ర కలిగిన పంబన్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోనున్నాయి. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ బ్రిడ్జి మధ్యలో భారీ ఓడల వచ్చినప్పుడు.. తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు ఉంటాయి. 2019లో కొత్త పంబన్‌ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఐదేళ్ల పాటు బ్రిడ్జి పనులు సాగాయి. రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య 1914లో పంబన్‌ బ్రిడ్జిని నిర్మించారు. అప్పట్లో 2.06 కిమీ పొడవైన బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 లక్షల ఖర్చు అయింది. దీనిని 2006-07లో మీటర్‌ గేజ్‌ నుంచి బ్రాడ్‌ గేజ్‌కి మార్చారు. అప్పుడు బ్రిడ్జి మధ్య నుంచి ఓడలు వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు కష్టపడితేనే బ్రిడ్జి తెరుచుకునేది. ఇప్పుడు బ్రిడ్జిని పూర్తిగా పైకి లిఫ్ట్‌ చేసేలా టెక్నాలజీని జోడించారు