మళ్లీ పిడుగు లాంటి వార్త.. దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలివే

www.mannamweb.com


మరో పిడుగులాంటి వార్త.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరోసారి కొత్త రూపు దాల్చింది. తాజాగా XEC అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడం..

ఇప్పటికే 27 దేశాల్లో గుర్తించడం ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకుంటున్న తరుణంలో ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది.. పలు దేశాల్లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XEC కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వేరియంట్ యూరప్ అంతటా వేగంగా వ్యాప్తిచెందుతోందని వెల్లడించారు. త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. కోవిడ్19 XEC వేరియంట్ ను తొలిసారిగా జర్మనీలో గుర్తించారు.ఈ వేరియంట్ లక్షణాలు మునుపటి స్ట్రెయిన్ల మాదిరిగానే ఉంటాయని, ఇది గతంతో పోలిస్తే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతోపాటు.. ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జూన్‌లో మొదటిసారిగా జర్మనీలో గుర్తించినప్పటి నుంచి అమెరికా, బ్రిటన్, చైనాతో సహా 27 ఇతర దేశాలలో వ్యాపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పోలాండ్, నార్వే, లక్సెంబర్గ్, ఉక్రెయిన్, పోర్చుగల్ లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఇది కూడా కరోనావైరస్ తరహాలోనే ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

XEC రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ KS.1.1 – KP.3.3 నుంచి ఎక్స్ఈసీ హైబ్రిడ్ రకంగా అవిర్భవించినట్లు పేర్కొంటున్నారు. శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. తద్వారా ఆసుపత్రిలో చేరడం కానీ, అనారోగ్యం బారిన పడడం కానీ ఉండదని పేర్కొంటున్నప్పటికీ.. ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా XEC గురించి స్పందించాల్సి ఉంది. Covid-19 ఎపిడెమియాలజీ ట్రాకర్ Outbreak.info వేరియంట్‌పై పరిశోధనలు చేస్తోంది. ఇది ఎంతమేర ప్రభావం చూపుందన్న విషయంపై పలు దేశాల్లో సేకరించిన వివరాల ప్రకారం అధ్యయనం చేస్తోంది. 27 దేశాల నుండి 500 నమూనాలు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో ఇంకా XEC కేసులు నివేదించలేదు..

ఎక్స్ఈసీ వేరియంట్ లక్షణాలివే..

తీవ్రమైన జ్వరం, నొప్పులు, అలసట, దగ్గు లేదా గొంతులో మంట – నొప్పి, చాలా మంది వారాల్లోనే కోలుకుంటారని.. అయితే కొంతమందిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తాయంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు వాసన తెలియక పోవడం, ఆకలి లేకపోవడం ద్వారా కొత్త రకం కోవిడ్ ఎక్స్ఈసీ లక్షణాలను గుర్తించవచ్చంటూ పేర్కొంటున్నారు. పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది.