Cement Prices: అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గృహ నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇళ్ల ధరలకు హద్దే ఉండటం లేదు. తాజాగా మరో వార్త ఇప్పుడు గృహ కొనుగోలుదార్లకు నిద్ర పట్టనివ్వడం లేదు.
దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించి షాక్ ఇచ్చాయి. ప్రాంతాన్ని బట్టి బస్తాకు 10 నుంచి 40 వరకు ప్రియం కానున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే డీలా పడిన గృహ కొనుగోళ్ల డిమాండ్ మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం రిటైల్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. పెద్దఎత్తున చేపడుతున్న నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్ద దెబ్బగా బిల్డర్లు చెబుతున్నారు.
బలహీన డిమాండ్ కారణంగా వరుసగా 5 నెలల పాటు సిమెంట్ ధరలు క్షీణించాయి. ఈ సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగాయి. సిమెంట్ ధరల పెంపు వల్ల ఇళ్లకు డిమాండ్ మరింత తగ్గుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ నిరంజన్ హీరానందని పేర్కొన్నారు. ప్రతి 10 రూపాయల సిమెంట్ ధర పెరుగుదల.. నిర్మాణ వ్యయంపై సుమారు 5 రూపాయల మేర ప్రభావం చూపుతుందని కొలియర్స్ ఇండియా MD జతిన్ షా తెలిపారు. వినియోగదారుల మనోభావాలను ఇది ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సిమెంట్ ధరలు పెరగడానికి వివిధ అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముడి పదార్థాలు, విద్యుత్ మరియు రవాణా ఖర్చుల పెరుగుదల ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు సవాలుగా నిలవనుంది. ఈ కారణంగా బిల్డర్‌లు ఈ ధరల హెచ్చుతగ్గులను నావిగేట్ చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న మరియు భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కొనసాగింపుపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచంలోనే భారత్ రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఉంది. దీనికితోడు గ్లోబల్ ఇన్‌స్టాల్ కెపాసిటీలో 8 శాతానికి పైగా వాటా ఇండియా సొంతం. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం భారతీయ సిమెంట్ పరిశ్రమ FY24లో దాదాపు 80 మిలియన్ టన్నుల (MT) సామర్థ్యాన్ని జోడించింది. గత 10 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. FY27 చివరి నాటికి సిమెంట్ వినియోగం 450.78 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.