దృశ్యం 3’ రెడీ.. ప్రకటించిన మోహన్ లాల్

అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ (Mohanlal) సినీ అభిమానులకు శుభవార్త చెప్పారు. ‘దృశ్యం3’ (Drishyam 3) రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph) దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’. 2013లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లోనూ రీమేక్‌ అయి, అన్ని చోట్లా అద్భుత స్పందన సొంతం చేసుకుంది.


ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘దృశ్యం2’ వచ్చింది. అయితే, కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఆ మూవీకి భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించారు. మోహన్‌లాల్‌ నటన, జీతూ జోసెఫ్‌ టేకింగ్, ట్విస్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆ కథను కొనసాగిస్తూ మూడో భాగం ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్‌ అనేక వేదికలపై ప్రకటించారు. సినిమా పట్టాలెక్కడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు ‘దృశ్యం3’ పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధమైందని సమాచారం. దీంతో మోహన్‌లాల్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. ‘దృశ్యం3’ రాబోతోంది’ అని పేర్కొన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్‌, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

ఇదీ ‘దృశ్యం’ సినిమాల కథ..: పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు వరుణ్‌ను జార్జ్‌కుట్టి కుటుంబం హత్య చేయడం, ఆ కేసులో చిక్కుకోకుండా తన కుటుంబాన్ని కాపాడుకునే కథతో ‘దృశ్యం’ వచ్చింది. అయితే, ఎప్పటికైనా వరుణ్‌ హత్య కేసు తన కుటుంబాన్ని వెంటాడుతుందన్న భయం మాత్రం జార్జ్‌లో ఉంటుంది. అనుకున్నట్లే కేసు రీఓపెన్‌ అవుతుంది. అయితే, తన తెలివితేటలతో జార్జ్‌ మళ్లీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అదే ‘దశ్యం2’. ఈ సినిమా క్లైమాక్స్‌లో వరుణ్‌ కుటుంబానికి జార్జ్‌కుట్టి ఓ లేఖ పంపుతాడు ‘మీరు అడిగినది మీకు ఇస్తున్నా. మళ్లీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి’ అంటాడు. ‘ఇది మూసేసిన కేసులాంటిది. కానీ, ఎప్పటికీ ముగియదు. నిజానికి మనం అతనిపై నిఘా పెట్టలేదు. అతనే వెయ్యి కళ్లతో మనల్ని గమనిస్తున్నాడు. నేను కచ్చితంగా చెప్పగలను. ఏ క్షణమైనా మనం తిరిగొస్తే, ఎలా ఎదుర్కోవాలా? అని ఈ క్షణం నుంచే సిద్ధమవుతూ ఉంటాడు. ఒకరకంగా చూస్తే, అతనికి అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది’ అని ఓ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. వరుణ్ హత్య కేసు నుంచి ఈసారి జార్జ్‌కుట్టి బయటపడిందన్నదే ‘దృశ్యం3’. మరి ఇక్కడితో ఈ కేసు ముగిస్తారా? కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరం