రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎంఎస్‌ఎస్‌సీ 2023) పథకానికి పోస్టాఫీస్ స్వస్తి పలికింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అతి తక్కువ కాల వ్యవధిలో అతి ఎక్కువ వడ్డీ అందించే ఈ పథకానికి స్వల్ప కాలంలోనే మంచి ఆదరణ లభించింది. అయితే విచారకరమైన విషయమేంటంటే.. 2023 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకాన్ని 2025 మార్చి 31తో ముగించారు.
ఈ పథకం వివరాల్లోకి వెళ్తే.. ఎంఎస్ఎస్సీ పథకంలో మహిళలు రూ. వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకు పోస్టాఫీసు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద ఖాతా తెరిచి రూ.2 లక్షలలోపు జమ చేసిన మొత్తానికి 7.5 శాతం వడ్డీ రేటును చెల్లిస్తారు. అంటే ఈ ఖాతాలో కనిష్టంగా రూ. వెయ్యి జమ చేస్తే రూ.160.. గరిష్టంగా రూ.2 లక్షలు జమ చేస్తే రూ.32,044 వడ్డీని కాల పరిమితి ముగిసేలోపు పొందవచ్చు. ఒక మహిళ మూడు నెలల వ్యవధిలో మరో ఖాతా తెరవవచ్చు. ఇలా ఖాతా మెచ్యురిటీ వ్యవధి 2 సంవత్సరాల గరిష్ట పరిమితికి లోబడి ఒక మహిళ 3 నెలల అంతరంతో ఎన్ని ఖాతాలైనా తెరవవచ్చు. వడ్డీని కూడా త్రైమాసిక పద్ధతిలోనే జమ చేస్తారు.
ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికే అత్యధిక వడ్డీ (8.2%) తో బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం అమలు చేస్తున్న పోస్టల్ శాఖ.. వయోపరిమితితో ప్రమేయం లేకుండా ఈ పథకాన్ని అమలు చేసింది. అంటే అమ్మాయికి సుకన్య ఖాతా తెరవ లేకపోయిన తల్లిదండ్రులకు చింత లేకుండా ఎంఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌తో భరోసా కల్పించవచ్చు. అయితే పోస్టాఫీసులో మహిళలను ఆకర్షించే పథకాలు లేకపోవడంతో పాటు స్వయం ఉపాధి పనులు చేసుకోలేని గృహిణులకు ఎంఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ పథకం వరంగా మారింది. కాగా, ఈ పథకం గురించి మహిళలకు పెద్దగా తెలియకముందే ఇది ముగిసిపోవడం విచారకరమన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగించాలని హైదరాబాద్ మహానగర మహిళలు ముక్త కంఠంతో కోరుతున్నారు.