Gold price: వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టిన బంగారం ధర

www.mannamweb.com


Gold price: వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టిన బంగారం ధర

Gold price | దిల్లీ: దేశీయంగా బంగారం ధర (Gold price) వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద వెయ్యి రూపాయల మేర తగ్గింది. దేశీయంగా నగల వ్యాపారులు భారీగా బంగారం విక్రయిస్తుండడం, అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం.

దేశ రాజధాని దిల్లీలో బుధవారం 10 గ్రాములు పసిడి ధర రూ.71,650 పలకగా.. గురువారం రూ.70,650కి తగ్గింది. హైదరాబాద్‌లో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.70,400 మేర పలుకుతోంది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.64వేలుగా ఉంది. వెండి ధర కూడా రూ.3,500 మేర క్షీణించి రూ.84 వేలుగా ఉంది. గడిచిన మూడు రోజుల్లో వెండి కిలోకు రూ.5 వేలు వరకు తగ్గడం గమనార్హం.

బంగారంపై బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధర తగ్గిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ తగ్గడంతో స్థానిక జువెలర్లు బంగారాన్ని విక్రయిస్తుండడం కారణమని ట్రేడర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2374 డాలర్లు పలుకుతోంది. జపాన్‌లో వడ్డీ రేట్లు పెంపు ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ యెన్‌ బలపడింది. మరోవైపు ఇతర కేంద్ర బ్యాంకులు రేట్ల కోత వేయాలని ఆలోచిస్తున్నాయని జేఎం ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ ప్రణవ్‌ మెర్‌ తెలిపారు. అమెరికా నుంచి జీడీపీ, వ్యక్తిగత వినియోగ సంబంధించిన గణాంకాలు బంగారం ధరలను దిశా నిర్దేశం చేయొచ్చని అంచనా వేస్తున్నారు.