ఇటీవల మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ కళాఖండాన్ని సృష్టించాడు. దీనికి ‘కమెడియన్’ అనే పేరు పెట్టాడు. అలాగే రేటు రూ.85 లక్షలు ఫిక్స్ చేశారు. ఇందులో అద్భుతమేమీ లేదు. సాధారణమైన అరటిపండు, టేపు మాత్రమే. కాకుంటే వాటిని అమూల్యమైన కళాఖండాల మధ్య ఉంచడంతో వీటికి క్రేజ్ వచ్చింది. అయితే ఊహించని విధంగా రూ.85 లక్షలకు అమ్ముడుపోయింది. పైగా ఈ ఆర్ట్ వర్క్‌ను ప్రదర్శనకు పెట్టిన ఆర్ట్ గ్యాలరీ.. ఈ పీస్‌కు ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. అయితే దీన్ని మౌరిజియా కాటెలాన్ అనే కళాకారుడు ప్రదర్శనకు పెట్టగా ఎంతోమంది దాన్ని కొనలేకపోయామని నిరాశ చెందుతూ దానిముందు నిల్చుని ఫొటోలు తీసుకుని సంతృప్తి చెందుతున్నారు.
ఇక ఎగ్జిబిషన్ చివరి రోజు కావడంతో ఈ కళాకండాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అయితే గుంపులో గోవింద లాగా ఓ వ్యక్తి ఆ అరటిపండును తీసుకుని తినేశాడు.అతడిపేరు డేవిడ్ డటూనా అని, అతడో డ్రామా ఆర్టిస్టు అని తెలిసింది. డేవిడ్ డటూనా అక్కడకు వచ్చి గబుక్కున గోడకు అతికించిన ఆ అరటిపండును తీసుకొని ఆరగించాడు. డేవిడ్ చేష్టకు అక్కడి నిర్వాహకులు షాక్ అయితే, చూసేందుకు వచ్చిన ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే, డేవిడ్‌పై నిర్వాహకులు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. కాకపోతే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అతడిని ఆదేశించారు. అదే గోడపై అదే చోట టేప్‌తో మరో అరటి పండును అతికించినా అది అమ్ముడవలేదు.