చిన్న వ్యాపారులకు ఆర్బీఐ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి కొత్త రూల్స్‌

మరి కొన్ని రోజుల్లో డిసెంబర్‌ నెల ముగిసి కొత్త సంవత్సరం రానుంది. ఈ నేపథ్‌యంలో చిన్న వ్యాపారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ న్యూఇయర్‌ గిఫ్ట్ అందిస్తోంది.


దేశంలోని MSME రంగానికి చౌకగా, రుణాలు పొందే మార్గం ఇప్పుడు సులభమైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. దీని కారణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. MSME లకు రుణాలు అందుబాటులో ఉండేలా చేయడానికి, వారి రుణాలు ఇప్పుడు బెంచ్‌మార్క్‌తో అనుసంధానించినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణాలపై వడ్డీ రేటు తిరిగి నిర్ణయిస్తారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పుల ప్రయోజనాలను MSME లకు త్వరగా అందించవచ్చు. దీనితో పాటు, ఇప్పటికే ఉన్న రుణదాతలు కూడా పరస్పర అంగీకారంతో కొత్త వ్యవస్థకు మారే అవకాశం అందిస్తోంది ఆర్బీఐ.

ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి:

చిన్న, మధ్య తరహా సంస్థలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించడం ఈ చర్య ప్రధాన లక్ష్యం. తద్వారా వారు తమ వ్యాపారాన్ని సులభంగా విస్తరించుకోవచ్చు. ప్రభుత్వ ఈ నిర్ణయం MSME రంగానికి బలమైన మద్దతును అందిస్తుంది. ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. దీనితో పాటు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) కింద MSME లకు అనేక సడలింపులు ఇచ్చారు. దేశీయ ఉత్పత్తికి నష్టం జరగకుండా ఉండటానికి సూక్ష్మ పరిశ్రమలకు ఆరు నెలలు, చిన్న పరిశ్రమలకు మూడు నెలలు అదనంగా అందిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఎగుమతి కోసం ముడి పదార్థాల దిగుమతి, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌బి) కోసం పరిమిత దిగుమతి, పాత స్టాక్ క్లియరెన్స్ కోసం కూడా సడలింపులు ఇస్తున్నామని తెలిపింది.

బిఐఎస్ ఫీజులలో గణనీయమైన సడలింపు:

MSMEలు అదనపు ఆర్థిక భారాన్ని మోయకుండా ఉండటానికి BIS రుసుములలో గణనీయమైన సడలింపు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదనంగా మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం రుణాలు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న సంస్థలు రూ.10 లక్షల వరకు రుణాలకు ఎటువంటి పూచీకత్తును అందించాల్సిన అవసరం లేదు. ఈ చర్యలన్నీ MSME రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.