పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సెక్యూరిటీపై హైకోర్టులో తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేనంతగా ఓ వెలుగు వెలిగిన చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ పీపీ మిథున్ రెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో చుక్కలు కనిపిస్తున్నాయి.


సీఎం చంద్రబాబుతో సై అంటే సై అనే వీరిద్దరికీ ప్రభుత్వ మార్పు తర్వాత భద్రత తగ్గించారు. దీనిపై వీరిద్దరూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై స్పందించిన ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పేసింది.

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 5 ప్లస్ 5 సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కేవలం ఎమ్మెల్యే కావడంతో 1 ప్లస్ 1 కు తగ్గించేశారు. అలాగే గతంలో మంత్రి కుమారుడు, ఎంపీ అయిన మిథున్ రెడ్డికి 4 ప్లస్ 4 సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు దాన్నీ 1 ప్లస్ 1కు తగ్గించారు. దీంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా హడావిడిగా సెక్యూరిటీ తొలగించారని వారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. దీంతో ప్రభుత్వం తరఫున వాదించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్.. చట్టపరమైన నిబంధనల ప్రకారమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భద్రత కల్పిస్తామని తేల్చిచెప్పేశారు. ఆయన కుమారుడి విషయంలోనూ చట్టప్రకారం ముందుకెళ్తామన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి తనకు అదనపు భద్రత కావాలంటూ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారని, ఎస్పీ మాత్రం అవసరం లేదని అభిప్రాయపడ్డారని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.