పిల్లలే ప్రపంచంగా తల్లిదండ్రులు బతుకుతుంటారు. వాళ్ళు పస్తులుండి పిల్లల కడుపు నింపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే కొందరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ల తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కనీ,పెంచీ, విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి కూడా వాళ్లకి మనసు రావడం లేదు.
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని తీసుకునేందుకు ముందు వరసలో ఉండే కొంతమంది ప్రబుద్ధులు, తల్లిదండ్రులకి అన్నం పెట్టాల్సి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇలా తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మం. అలీపూర్ కు చెందిన బాలయ్య అనే వ్యక్తి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తాను కనిపెంచిన కొడుకులు తనకి అన్నం పెట్టట్లేదని, సరిగా చూసుకోవట్లేదని, మనస్థాపానికి గురైన బాలయ్యతన యావ దాస్తిని కొండగట్టు అంజన్నకు సమర్పించేందుకు సిద్దమయ్యారు. తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ పెద్దాయన కొండగట్టుకు చేరుకున్నారు.
అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన తన స్థిర చర ఆస్తికి సంబంధించిన పత్రాలను కొండగట్టు దేవస్థానంలోని హుండీలో వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో ఆ హుండీలో వేస్తే ఆ ఆస్తి అంజన్నకి చెల్లదని పూజారులు చెప్పడంతో, తన ఆస్తిని కొండగట్టు అంజన్న పేరుతో పట్టా చేస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కోరారు.