టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత క్రికెట్ జట్టు తమ సన్నాహకాలను ప్రారంభించనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా, టోర్నీకి ముందు ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఫిబ్రవరి 4న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇవే జట్లు పోటీపడగా, భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్మప్ మ్యాచ్ రూపంలో ఆ ఫైనల్‌కు రిపీట్ జరగనుండటం ఆసక్తి రేపుతోంది.భారత్ మాదిరిగానే, దాయాది పాకిస్థాన్ కూడా ఒకే వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న కొలంబోలో ఐర్లాండ్‌తో పాక్ జట్టు తలపడనుంది.
మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఎలాంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదు. అయితే, ఈ రెండు జట్లు టోర్నీకి కొన్ని రోజుల ముందు వరుసగా శ్రీలంక, పాకిస్థాన్‌లతో ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొననున్నాయి. బంగ్లాదేశ్ స్థానంలో టోర్నీకి అర్హత సాధించిన స్కాట్లాండ్ రెండు వార్మప్ మ్యాచ్‌లలో (ఆఫ్ఘనిస్థాన్, నమీబియాలతో) పోటీపడుతుంది. ఈ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఇండియా ‘ఏ’ జట్టు కూడా భాగమైంది. ఫిబ్రవరి 2న నవీ ముంబైలో యూఎస్‌ఏతో, ఫిబ్రవరి 6న బెంగళూరులో నమీబియాతో ఇండియా ‘ఏ’ తలపడనుంది. మొత్తం వార్మప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు నవీ ముంబై, బెంగళూరు, చెన్నై, కొలంబో వేదికలుగా జరగనున్నాయి. ఇక అసలు టోర్నమెంట్ ఫిబ్రవరి 7న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో అట్టహాసంగా ప్రారంభం కానుంది.

































