ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి అధికారులు కసరత్తు చస్తున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే రూ 4 వేలకు పెన్షన్లు పెంచి అమలు చేస్తున్నారు. తల్లికి వందనం అమలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక..మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం దాదాపు ముహూర్తం ఖారారు అయింది.
ప్రభుత్వం కసరత్తు
ఏపీలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రకటించారు. అందులో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు తీరు పైన నివేదికలు కోరారు. రోజుకు ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు..ఎంత మేర భారం పడుతుంది…అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి..ఆర్దికంగా తీసుకోవాల్సిన చర్యల పైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్దం చేసారు.
అధికారుల నివేదికలు
మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దాని పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేయటం ప్రారంభిస్తే సాధారణ ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవని అధికారులు సూచించారు. కొత్త బస్సులు తీసుకొనే వరకూ పథకం వాయిదా వేయాలనే సూచనలు అందుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ముహూర్తం ఖరారు
అన్నీ అనుకలిస్తూ ఆగస్టు15న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే రోజున అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో..ఈ పథకం నిర్వహణ ద్వారా పడే భారం పైన అధికారులు తుది నివేదిక సిద్దం చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికల పైన చర్చించి..అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.