అమరావతి: రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఫీజుల పెంపు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభమైన తర్వాత.. అంటే ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల పెంపు అమలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జూన్ ఒకటిన చివరి విడత పోలింగ్ ముగిసేవరకు టోల్ ఫీజుల పెంపు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీంతో ఆదివారం నుంచి ఫీజుల పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 70 టోల్ ప్లాజాలు ఉండగా వీటిలో ఐదు మినహా, మిగిలిన అన్నింటా ఆయా వాహనాలకు ప్రస్తుతమున్న టోల్ ఫీజుల్లో సగటున 5% వరకు పెంపు అమల్లోకి వచ్చినట్లు అయింది. ఇది వచ్చే ఏడాది మార్చి చివరి వరకు కొనసాగుతుంది. మరోవైపు నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్న ఐదు టోల్‌ప్లాజాల్లో మాత్రం ఫీజులను జులై, ఆగస్టు మాసాల్లో సవరిస్తారు.
ఎక్స్‌ప్రెస్ వేలపై 5% పెంపు
దిల్లీ: ఎక్స్‌ప్రెస్ వేలను ఉపయోగించే వాహనదారులు ఇకపై 5% అదనంగా టోల్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 3 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారి ఒకరు తెలిపారు. జాతీయ రహదారులపై మొత్తం 855 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 180 ప్లాజాలను గుత్తేదారులు నిర్వహిస్తున్నారు.
ఓఆర్‌ఆర్ టోల్‌ఛార్జీల పెంపు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) టోల్ ఛార్జీలను ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ఆదివారం ప్రకటించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌బీ సంస్థ గత ఏడాది 30 ఏళ్ల లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెలుసుబాటు సంస్థకు ఉంది. దీనిలో భాగంగా పెంచిన కొత్త ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.