ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. వందేభారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పు జరిగింది. సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ (20707/ 20708) వందేభారత్ రైళ్లు నడిచే రోజుల్లో మార్పులు చేశారు.
ప్రస్తుతం ఈ రెండు రైళ్లు ప్రతి గురువారం మినహా అన్ని రోజుల్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబరు 2వ తేదీ నుంచి సోమవారం మినహా అన్ని రోజుల్లో నడుస్తాయి.. అంటే ప్రతి గురువారం బదులు ప్రతి సోమవారం నడుస్తాయి. ఈ రెండు రైళ్ల సర్వీసులకు సంబంధించి అందుబాటులో ఉండేలా మార్పు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20707/ 20708).. సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయల్దేరి.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా విశాఖపట్నానికి మధ్యాహ్నం 13.50కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి రాత్రి 23.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
మరోవైపు ఏపీ మీదుగా నడిచే మరో వందేభారత్ రైలు షెడ్యూల్ కూడా మారింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (20703-20704) మధ్య నడిచే రెండు వందేభారత్ రైళ్ల షెడ్యూల్ మార్చారు అధికారులు. ఈ రెండు రైళ్లు ఇప్పటివరకు బుధవారం మినహా ఆరు రోజులు నడుస్తున్నాయి. డిసెంబర్ 5 నుంచి ప్రతి శుక్రవారం ఈ రైలు నడవదు.. అంటే బుధవారం బదులు శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉండదు.
కాచిగూడ-యశ్వంతపూర్ వందేభారత్ రైలు (20703-20704).. ఉదయం 5.45 గంటలకు కాచిగూడలో బయల్దేరి.. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో.. యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 14.45 గంటలకు బయల్దేరి రాత్రి 12 గంటలక కాచిగూడ చేరుకుంటుంది. ఈ మేరకు రైలు ప్రయాణికులు ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్ మార్పును గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ మార్పులు ఉంటాయి అంటున్నారు. ఈ రైళ్ల షెడ్యూల్‌ను ఆయా రూట్లలో డిమాండ్‌ను బట్టి మార్చినట్లు తెలుస్తోంది.



































