గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్న తీవ్రమైన వాతారవణ పరిస్థితులకు ఇవే కారణం.
వర్షాకాలమంతా పడాల్సిన వర్షం, ముందుగానే ప్రారంభం కావడం… పైగా సగం రోజుల్లోనే కుండపోతలా పడటం.. ఎప్పుడూ చూడని ఎండలు మంటలు పుట్టించడం.. ఎండా కాలం రాత్రుల్లో కాస్త చలిగా ఉండటం.. ఇవన్నీ వీటీ సైడ్ ఎఫెక్ట్‌లే..! ఇంకా స్పష్టం చెప్పాలంటే ఎల్‌నినో, లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కడం, చల్లబడటం వల్ల జరిగే వాతావరణ మార్పులు. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన ఎల్ నినో ప్రభావం క్రమంగా బలహీనపడుతూ చల్లదనానికి కారణమయ్యే లా నినా ప్రభావం బలపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి.. లా నినా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో డీటెయిల్‌గా తెలుసుకుందాం. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు లా నినా పీరియడ్ నడుస్తోంది. లా-నినా వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. చలి గాలులు ఎక్కువగా వీస్తాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి లా నినా ప్రభావం 71శాతం పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, భారీ హిమపాతం, దేశమంతటా చలిగాలులు వణుకు పుట్టించే చాన్స్ ఉందని అంచనా వేస్తోంది. లా నినా వలన పసిఫిక్ మహాసముద్రం పైన భూమధ్యరేఖ వెంబడి వీచే గాలులు, అంటే తూర్పున దక్షిణ అమెరికా నుంచి పశ్చిమాన ఆసియా వైపు వీచే గాలులు సాధారణం కంటే బలంగా ఉంటాయి. ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపుకు వెచ్చటి నీటిని తీసుకొస్తాయి. దాంతో, సముద్రమట్టాలు పెరుగుతాయి. అవతల అమెరికా వైపు చల్లటి నీరు ఉపరితలం పైకి వస్తుంది. దీని ప్రభావం పసిఫిక్ మహా సముద్రానికే పరిమితం కాదు. మొత్తం ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.
ఈ ‘లా నినా’ కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో చలికాలం మరింత చల్లగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని అంటోంది. ఉత్తరాదితో పాటు.. తెలుగు రాష్ట్రాలపై కూడా లా నినా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
































