తెలంగాణ రాజ్ భవన్ లో దొంగతనం.. పోలీసులకు చిక్కిన దొంగ బాబు

 తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా రాజ్ భవన్‌లో ఈ సంచలనం చోటు చేసుకోవడం గమనార్హం. నిత్యం హై సెక్యూరిటీతో ఎంతో హడావిడిగా ఉండే రాజ్‌భవన్‌లో ఓ అగంతకుడు చేతి వాటం చూపాడు.


రాజ్‌ భవన్‌లో విలువైన హార్డ్‌ డిస్క్‌లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సుధర్మ భవన్‌లో మొత్తం 4 హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్లు రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు మంగళవారం (మే 20) ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రూమ్ నుంచి ఈ హార్డ్ డిస్క్‌లు మాయం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

హైసెక్యూరిటీ ఉన్న తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ జరిగింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్‌డిస్క్‌లు మాయం అయ్యాయి. పోలీసులకు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి.. హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. మే 14వ తేదీ రాత్రి హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు నిర్థారించారు. హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్ వ్యవహారాలతోపాటు.. కీలకమైన కొన్ని రిపోర్ట్‌లు, ఫైల్స్‌ ఉన్నట్టు సమాచారం. 14వ తేదీన హెల్మెట్‌తో కంప్యూటర్‌ రూమ్‌లోకి వెళ్లింది ఎవరు..? అనే దానిపై ప్రస్తుతం పోలీసులు దృష్టిసారించారు.

పోలీసుల అదుపులో నిందితుడు..

రాజ్‌భవన్‌లో కలకలం రేపిన చోరీ ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. గతంలో అక్కడి కంప్యూటర్‌ విభాగంలో పనిచేసిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితుడి నుంచి హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు. రాజ్ భవన్‌లో పనిచేసే ఓ మహిళ ఫొటోలను అక్కడి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది శ్రీనివాస్ మార్ఫింగ్‌ చేశాడు. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన శ్రీనివాస్‌ ఫొటోల మార్ఫింగ్‌కు ఉపయోగించిన కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్‌ కోసం వచ్చి, దానిని ఎత్తుకెళ్లాడు. అయితే రాజ్ భవన్ అధికారులు దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అసలు నిందితుడు శ్రీనివాస్‌గా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఏసీపీ మోహన్ కుమార్ తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.