ఏపీలో వడగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు వడగాల్పులు వీచే మండలాలు(130): శ్రీకాకుళంలో 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20.
బుధవారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో43.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాలులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.