ఈ 5 బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ అక్కర్లేదు.. జాబితా ఇదే

పొదుపు ఖాతాల్లో కనీస సగటు నిల్వ లేనిపక్షంలో బ్యాంకులు అపరాధ రుసుమును విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఛార్జీల నుంచి కొన్ని బ్యాంకులు మినహాయింపు కల్పించి ఖాతాదారులకు ఊరటనిస్తున్నాయి.


ఇటీవల పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడా వంటి బ్యాంకులు దీనిపై ప్రకటన చేశాయి. మరి, ఇప్పటివరకు ఏయే బ్యాంకుల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌పై ఛార్జీలు (Minimum Balance Charges) ఎత్తివేశారో ఓసారి చూద్దాం.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌..

తమ బ్యాంకులోని అన్ని సేవింగ్‌ ఖాతాల్లో కనీస సగటు నిల్వ (ఎంఏబీ)లు లేనిపక్షంలో విధించే పెనాల్టీలను ఎత్తివేస్తున్నట్లు పీఎన్‌బీ (PNB) వెల్లడించింది. జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. మహిళలు, రైతులు, అల్పాదాయ కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ఎండీ, సీఈఓ అశోక్‌చంద్ర పేర్కొన్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా..

”ఎలాంటి ఆందోళనలు లేని బ్యాంకింగ్‌ సేవలను అందిస్తున్నాం. ఇకపై కనీస బ్యాలెన్స్‌లపై ఎలాంటి అపరాధ రుసుములు ఉండవు. అన్ని సేవింగ్‌ ఖాతాలకు ఇది వర్తిస్తుంది” అని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda) జులై 2వ తేదీన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

ఇండియన్‌ బ్యాంక్‌..

ఈ జాబితాలో చేరిన మరో బ్యాంకు ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank). జులై 7వ తేదీ నుంచి అన్ని సేవింగ్‌ ఖాతాలపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

కెనరా బ్యాంక్‌..

కెనరా బ్యాంక్‌ (Canara Bank) ఈ ఏడాది మే నెలలోనే దీనిపై ప్రకటన చేసింది. అన్నిరకాల పొదుపు (సేవింగ్స్‌) బ్యాంకు ఖాతాలు, శాలరీ అకౌంట్లు, ఎన్నారైల ఎస్‌బీ అకౌంట్లు, మరికొన్ని ఇతర ఖాతాలకు కనీస నిల్వ (మినిమమ్‌ బ్యాలెన్స్‌) ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం కూడా జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. విద్యార్థులు, శాలరీ ఖాతాలు ఉన్న ఉద్యోగులు, ఎన్నారైలు, సీనియర్‌ సిటిజన్లు, ఇతర వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని కెనరా బ్యాంకు పేర్కొంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) చాలా ఏళ్ల నుంచే కనీస నిల్వలపై ఈ ఛార్జీల నుంచి ఖాతాదారులకు ఊరట కల్పిస్తోంది. 2020లోనే ఈ అపరాధ రుసుమును ఎస్‌బీఐ ఎత్తివేసింది. అప్పటినుంచి ఈ బ్యాంకులోని అన్ని సేవింగ్స్‌ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ లేకపోయినా ఎలాంటి ఛార్జీలు పడట్లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.