స్టీల్‌ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో అసలుకే ఎసరు పక్కా.. జర భద్రం

అనాదిగా చాలా మంది ఇళ్లలో స్టీల్ పాత్రలను వంటకు, భోజనానికి, ఆహార పదార్ధాల నిల్వకు వినియోగించడం చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో దాదాపు అన్ని ఇళ్లల్లో ఇవి కనిపిస్తాయి. అయితే మీకు తెలుసా కొన్ని రకాల ఆహారాలను స్టీల్ పాత్రల్లో ఉంచితే వాటి రుచి చెడిపోవడమేకాకుండా పాత్రల నాణ్యతను కూడా దెబ్బతీస్తాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది ఇళ్లలో స్టీల్ పాత్రలు వినియోగిస్తుంటారు. ఈ స్టీల్ కంటైనర్లను ఎక్కువగా కిరాణా సామాగ్రిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తుంటారు. లంచ్ బాక్స్‌ల నుంచి పప్పులు, చక్కెర మొదలైన వాటిని నిల్వ చేయడానికి రకరకాల స్టీల్‌ పాత్రలను వినియోగిస్తారు. అయితే, ఈ స్టీల్ కంటైనర్లలో కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఆహారం రుచి చెడిపోవడమే కాకుండా, దాని పోషక విలువలు కూడా తగ్గుతాయట. స్టీల్ కంటైనర్లలో ఏయే ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.


ఊరగాయలు

ఊరగాయ పచ్చళ్లను ఎప్పుడూ స్టీల్ పాత్రలో నిల్వ చేయకూడదు. ఉప్పు, వెనిగర్, నూనె మిశ్రమంగా ఉండే ఊరగాయలు సహజ ఆమ్లాలతో నిండి ఉంటాయి. ఇవి లోహంతో చర్య జరిపే అవకాశం ఉంది. దీనివల్ల ఊరగాయ త్వరగా చెడిపోతుంది. దాని రుచి కూడా చెడిపోతుంది. అందువల్ల ఊరగాయలను గాజు లేదా సిరామిక్ జాడిలో నిల్వ చేయడం మంచిది.

పెరుగు

పెరుగు సహజంగా ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కాబట్టి స్టీల్ కంటైనర్‌లో ఎక్కువసేపు దీనిని నిల్వ చేస్తే దాని రుచి చెడిపోతుంది. కాబట్టి పెరుగును రుచికరంగా ఉంచడానికి, దానిని సిరామిక్ లేదా గాజు కంటైనర్‌లో నిల్వ చేయడం మంచిది.

సిట్రస్ ఆహారాలు

నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు స్టీల్ కంటైనర్లలో ఉంచకూడదు. ఈ సిట్రస్ వంటకాలను స్టీల్ కంటైనర్లలో నిల్వ చేయడం వల్ల వాటి రుచిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వాటి ఆమ్లత్వం కూడా కంటైనర్ కరిగిపోయేలా చేస్తుంది. కాబట్టి సిట్రస్ పండ్లు, నిమ్మరసం లేదా ఇతర పుల్లని వంటకాలు గాజు లేదా మంచి నాణ్యత గల గాజు కంటైనర్లలో నిల్వ చేయాలి.

టమోటా ఆధారిత వంటకాలు

టమోటాలు, టమోటా ఆధారిత వంటకాలను స్టీల్ కంటైనర్లలో నిల్వ చేయడం అంత మంచిది కాదు. టమోటాలలో ఆమ్ల పదార్థం ఉన్నందున, వంటకం రుచి దాని పోషక విలువలు రెండూ చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వంటకాలను సిరామిక్, గాజు గిన్నెలలో నిల్వ చేయకూడదు.

పండ్లు – సలాడ్లు

కట్ చేసిన పండ్లు లేదా పండ్ల సలాడ్లు స్టీల్ కంటైనర్లలో నిల్వ చేయకూడదు. దీనివల్ల పండ్లలోని నీటి శాతం బయటకు వచ్చి పండ్ల రుచి చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గాజు లేదా మంచి నాణ్యత గల ప్లాస్టిక్, సిరామిక్ గిన్నెలలో నిల్వ చేయాలి.

ఉప్పు

ఉప్పును స్టీల్ పాత్రలలో అస్సలు నిల్వ చేయకూడదు. ఇది లోహంతో ప్రతిచర్య జరపకపోయినా, లోహ పాత్రలలో ఎక్కువసేపు ఉప్పును నిల్వ చేయడం వల్ల ఉప్పులోకి తేమ చేరి, ఉప్పు నాణ్యతను ప్రభావితం చేస్తుంది. కంటైనర్ తుప్పు పట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎల్లప్పుడూ గాలి చొరబడని గాజు, సిరామిక్ పాత్రలలో ఉప్పును నిల్వ చేయడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.