‘కిడ్నీలకు’ ముప్పు తెచ్చే అలవాట్లు ఇవే! – నిపుణులు ఏమంటున్నారంటే

 శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఎందుకంటే ఇవి శరీరంలోని వ్యర్థాలను వడపోవడం, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మిలియన్ల మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అధిక శాతం దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) కేసులు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో మన రోజువారీ అలవాట్లు కొన్ని కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలను దెబ్బతీసే అలాంటి అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!


పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడటం : తరచుగా వాడే ఓవర్​ ది కౌంటర్ నొప్పి నివారణ మందులు (NSAIDs), అనాల్జెసిక్స్ వంటివి మూత్రపిండాలను దెబ్బతీస్తాయని National Kidney Foundation అధ్యయనంలో పేర్కొంది. ఈ మందులు మూత్రపిండాలకు రక్త ప్రసరణను తగ్గిస్తాయని, కాలక్రమేణా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే డాక్టర్లు పెయిన్ కిల్లర్స్ అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించమని సిఫార్సు చేస్తారని వివరించారు.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం : అధిక సోడియం తీసుకోవడం మూత్రపిండాలకు హానికరమంటున్నారు. మనం రోజు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, ఇది కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఒకటని చెబుతున్నారు. ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం లేదా దానికి బదులుగా సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉపయోగించడం మంచి మార్గమని తెలిపారు. అలాగే, ఎక్కువగా ఉప్పు, హానికరమైన పదార్థాలు ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కూడా తగ్గించాలని సూచిస్తున్నారు.

తగినంత నీరు తాగకపోవడం : పని, ఉద్యోగం లేదా రోజువారీ పనిలో పడి చాలామంది నీరు తాగడమే మర్చిపోతారు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడడంతో పాటు మూత్రపిండాలు వ్యర్థాలను తొలగించడంలో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య కాలక్రమేణా మూత్రపిండాల రాళ్లు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని పేర్కొన్నారు.

సరిపడా నిద్ర లేకపోవడం : ఇది మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మూత్రపిండాల పనితీరు నిద్ర-మేల్కొలుపు చక్రం ద్వారా నియంత్రించబడుతుంది, ఇది 24 గంటల పాటు మూత్రపిండాల పనిభారాన్ని సమన్వయం చేయడానికి సహాయపడుతుందని Asian Institute of Nephrology and Urology అధ్యయనంలో పేర్కొంది. ఈ క్రమంలో రోజూ రాత్రి కనీసం 7-8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని సలహా ఇస్తున్నారు.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం : ఉప్పులాగే, చక్కెర కూడా కిడ్నీలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. షుగర్ కంటెంట్​ను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని, ఇది అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వివరిచారు. ఇవి రెండూ మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణాలంటున్నారు.

ధూమపానం : సాధారణంగా పొగతాగడానికి, కిడ్నీల ఆరోగ్యానికి సంబంధం లేదని చాలామంది భావిస్తారు. కానీ, ధూమపానం వల్ల కిడ్నీల మీద నేరుగా, పరోక్షంగాను చాలా హానికరమైన ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల రక్తనాళాలను గట్టిగా, సన్నగా మారేలా చేస్తుందని, దీనివల్ల కిడ్నీలకు అందే రక్త ప్రసరణ తగ్గుతుందని వివరించారు. దీంతో కిడ్నీలు వ్యర్థాలను సమర్థవంతంగా వడపోత చేయలేవని, ఇది వాటి పనితీరును దెబ్బతీస్తుందని తెలిపారు.

ధూమపానం హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది. రక్త నాళాలలో కొవ్వు నిల్వలు, రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఈ విషయాలన్నీ మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. ధూమపానం కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా రెట్టింపు చేస్తుంది. కానీ ధూమపానం మానేయడం వల్ల ఈ ప్రమాదాలన్నింటినీ తగ్గించడంలో సహాయపడుతుందని kidney care uk అధ్యయనంలో పేర్కొంది.

మద్యపానం : మద్యం సేవించడం కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా అధిక మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఇది కిడ్నీలు పనిచేసే విధానాన్ని మారుస్తుందని, వ్యర్థాలను వడపోత చేయడంతో పాటు శరీరంలో నీటి సమతుల్యతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అధికంగా మద్యం సేవించడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురవుతుందని, దీనివల్ల రక్తపోటు పెరిగి కిడ్నీలకు నేరుగా హాని కలుగుతుందని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.