ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయనతోపాటు కూటమి నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది.
టీడీపీ నుంచి..
తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రిగిరి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే నారా లోకేశ్ అండ్ టీమ్ ఇప్పటికే 50 మంది పేర్లతో జాబితాను గత రాత్రే సిద్దం చేసినట్లు సమాచారం. నారా లోకేశ్‌తో పాటు పీ. నారాయణ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
జనసేన నుంచి..
జనసేన పార్టీ నుంచి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌కు సైతం మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి..
ఇక బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు సమాచారం. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సుజనా చౌదరిలకు పక్కాగా చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కనున్నాయనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే అంశంపై ఈ రోజు రాత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.
సామాజిక వర్గాలు.. లెక్కలు
మరోవైపు చంద్రబాబు కేబినెట్‌లో బీసీలకు పెద్ద పీట వేయనున్నారు. అందులోభాగంగా 8 నుంచి 9 మంది బీసీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఎస్సీల నుంచి ఇద్దరికి.. అంటే ఎస్సీల్లో ఉండే రెండు వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఎస్టీ, వైశ్యులు, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించనున్నారు.
అలాగే కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చేరో నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయి. మరోవైపు వైశ్య సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిద్దరు టీడీపీ అభ్యర్థులే.. ఒకరు జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య కాగా.. మరొకరు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్. ఈ ఇద్దరిలో ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం.
అదే విధంగా మైనార్టీ వర్గాలను నుంచి ఎన్ఎండీ ఫరూక్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మదనపల్లి ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ బాషా విజయం సాధించారు. వీరిలో ఒకరికి లేదా ఇద్దరికి కేబినెట్‌లో బర్త్ దక్కే అవకాశం ఉంది. అయితే కేబినెట్ కూర్పులో సీనియారిటీతోపాటు.. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా పసుపు జెండాను వదలని వారిని సైతం పరిగణలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఏ కన్వెన్షన్ సెంటర్ టు రాజ్ భవన్
అదీకాక ఈ రోజు ఉదయం ఎన్డీఏ పక్షాల తరఫున ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. దీంతో ఎన్డీఏ శాసన సభ పక్ష నేతగా చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఈ రోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు కూటమి తరఫున అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరీ వెళ్లారు. ఎన్డీఏ శాసన సభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు.. అందుకు సంబంధించిన వివరాలను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వారు అందజేశారు. దీంతో రేపు ఉదయం చంద్రబాబుతోపాటు ఆయన కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది.
Beta feature