గోల్డ్‌ లోన్‌ కొత్త రూల్స్‌ ఇవే

త్యవసర సమయాల్లో అందరికీ గుర్తొచ్చేవి గోల్డ్‌ లోన్సే. వైద్యం, విద్య, వ్యాపారం, వ్యవసాయం ఇలా చెప్పుకుంటూపోతే మన ప్రతీ నగదు అవసరాలు వేగంగా తీరే మార్గం ఒక్క బంగారం తనఖా రుణాల ద్వారానే ఉంటుందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.


పైగా పసిడి తాకట్టుపై ఇచ్చే ఈ రుణాలు సెక్యూర్డ్‌ లోన్స్‌. కాబట్టి రుణదాత (బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు)లూ వీటికి అమితాసక్తినే కనబరుస్తూంటారు. అయితే ఈ బిజినెస్‌లో అవకతవకలకు వీలుందన్నదానిపై దృష్టిపెట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ).. ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్ని గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.

బుల్లెట్‌ రీపేమెంట్‌ పథకాల్లో చెల్లింపుల కోసం ఉండే గరిష్ఠ కాలపరిమితి 12 నెలలకు పరిమితం.

36 నెలలదాకే ఈఎంఐ ఆధారిత రుణాల కాలపరిమితి.

మునుపు గోల్డ్‌ లోన్స్‌ ఏటా రెన్యువల్‌ చేసుకునే వీలుండేది. ఇప్పుడది లేదు.

బ్యాంకుల ద్వారా తీసుకునే రుణం రూ.2.5 లక్షలలోపే ఉంటే.. తనఖా పెట్టిన బంగారం మార్కెట్‌ విలువలో 85 శాతం రుణంగా వస్తుంది. బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్‌ బ్యాంకుల్లో ఇది 88 శాతంగా ఉన్నది.

అల్పాదాయ, గ్రామీణ రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా రూ.2.5 లక్షలలోపు రుణాలకు ఆదాయ మదింపు, క్రెడిట్‌ స్కోర్‌ తనిఖీలు లేవు.

బంగారు నగలైతే కిలోదాకా, బంగారు నాణేలైతే 50 గ్రాములదాకా, వెండి ఆభరణాలైతే 10 కిలోలదాకా, వెండి నాణేలైతే 500 గ్రాములదాకా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు.

రుణం తీర్చేసిన రోజే తనఖా పెట్టిన బంగారం, వెండిని రుణగ్రహీతలకు రుణదాతలు ఇచ్చేయాలి. ఇక 7 పనిదినాలు దాటినా ఏ కారణంచేతనైనా ఇవ్వకపోతే రోజుకు రూ.5,000 నష్టపరిహారాన్ని రుణగ్రహీతలకు చెల్లించాలి.

తాకట్టు పెట్టిన బంగారం, వెండి పోయినా, డ్యామేజీ అయినా రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో రుణదాతలే ఇవ్వాల్సి ఉంటుంది.

రుణం తీర్చకపోతే తనఖా పెట్టిన వాటిని వేలం వేసే ముందు తప్పకుండా రుణగ్రహీతలకు రుణదాతలు నోటీసు ద్వారా తెలియజేయాలి.

వేలంలో కనీస ధరను బంగారం, వెండి మార్కెట్‌ విలువలో 90 శాతంగా నిర్ణయించాలి.

వేలం వేయగా మిగిలిన బంగారం, వెండిని రుణగ్రహీతలకు రుణదాతలు వారం రోజుల్లో తిరిగి అప్పగించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.