టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చివర్ల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమ్‌ఇండియా (Team India) ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఒకదశలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో భారత అభిమానుల్లో ఆందోళన చెందారు. కానీ, భారత బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి భారత్‌కు రెండోసారి పొట్టికప్పును అందించారు.
భారత్ విజయంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లోని చివరి ఐదు ఓవర్లే కీలకం అని చెప్పాలి. ఈ ఐదు ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్‌లో క్లాసెన్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదాడు. దీంతో దక్షిణాఫ్రికా 147/4 స్కోరుతో నిలవడంతో మ్యాచ్ చేజారియే పోయేలా కనిపించింది. కానీ, రోహిత్ తన కెప్టెన్సీ నైపుణ్యానికి మరింత పదునుపెట్టి బుమ్రాని రంగంలోకి దించాడు. అతడు 16 ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చాడు. హార్దిక్ పాండ్య తర్వాతి ఓవర్‌లో డేంజరస్ క్లాసెన్‌ను ఔట్ చేసి నాలుగే పరుగులు ఇవ్వడంతో టీమ్ఇండియా మళ్లీ రేసులోకి వచ్చింది. 18 ఓవర్లో బుమ్రా.. మార్కో యాన్సెన్‌ను ఔట్ చేసి రెండు పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ 19 ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నాలుగు పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే మిల్లర్‌ను ఔట్ చేశాడు హార్దిక్. తర్వాతి ఐదు బంతుల్లో పాండ్య ఎనిమిది పరుగులు ఇచ్చి మరో వికెట్ పడగొట్టాడు. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం పొట్టికప్‌ను భారత్ ముద్దాడింది.