Financial Plan : ఈ ఏడు సూత్రాలు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి!

www.mannamweb.com


Personal Finance : జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత, ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. సొంతి ఇల్లు, పిల్లల చదువులు, పెళ్లి, కారు ఇలా చాలా ఉంటాయి. వీటితోపాటు చాలా మందికి కోటీశ్వరులు కావాలనే ఆశ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక అనేది ప్రణాళికాబద్ధంగా క్రమపద్ధతిలో జీవిత లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే ప్రక్రియ. తమకున్న ఆర్థిక వనరులను సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఇందులో ఒక భాగం. ముఖ్యంగా యువకులలో ఆర్థిక ప్రణాళిక ఉండదు. వారి ఇది అలవాటు చేయడం కష్టమైన పని. వారు తమ ఆర్థిక విషయాల గురించి తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఎక్కడ, ఎలా ప్రారంభించాలో అర్థం కాదు. ఇక్కడ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికను బాగా ప్లాన్‌ చేసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అసెట్స్ & సేవింగ్స్
ఒక వ్యక్తి తాను సంపాదించే డబ్బును సరైన పద్ధతిలో నిర్వహించడానికి గొప్ప ఆర్థిక నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం నిబద్ధత చూపితే సరిపోతుంది. తాను నెలవారిగా సంపాదించే దానిలో ఎంతో కొంత పొదుపు చేయాలని నిర్ణయించుకోవడం డబ్బు నిర్వహణలో తొలి అడుగు. మెరుగైన ఆర్థిక స్వాతంత్రం కోసం డబ్బు ఆదా చేయడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆ సమయంలో కొన్ని సార్లు అప్పు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంది. ఆ సమయంలో డబ్బు పొదుపు అవసరం ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. డబ్బును ఆదా చేసుకోవడం వల్ల అప్పుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా క్రమం తప్పని పొదుపు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది, దీంతో కావాల్సిన ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవచ్చు. యుక్త వయసులో ఉన్నప్పటి నుంచే పొదుపు పాటించాలి.

అప్పులు & భాద్యతలు
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆస్తులు, అప్పుల జాబితా తయారు చేసుకోవాలి.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌, పెట్టుబడులు, ఇంటి విలువ, ఇతర ఆస్తుల విలువను లెక్కకట్టుకోవాలి. కారు లోన్, హౌస్ లోన్, క్రెడిట్ కార్డుల బ్యాలెన్స్ లతో పాటు ఇతర అప్పుల లిస్టును రూపొందించుకోవాలి. ఈ వ్యక్తిగత బ్యాలెన్స్‌ షీట్‌ ఆర్థికపరంగా మీ నికర విలువ ఎంత ఉందో చూపుతుంది. మీ ఆర్థిక స్థితిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఉన్న మిగులు డబ్బుతో ఎలా వ్యవహరిస్తారనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ వద్ద ఉన్న డబ్బులను సరైన చోట పెట్టుబడి పెట్టకపోతే ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ క్రమేపీ క్షీణించే అవకాశం ఉంది. దీంతో మీరు భవిష్యతులో పెట్టుకున్న లక్ష్యాలను సాధించలేరు. కాబట్టి, ఎంత త్వరగా పెట్టుబడిని ప్రారంభిస్తే అంత మంచిది.

బడ్జెట్‌
జీతం మీద జీవించే వారి ఖర్చులు వారి శక్తికి మించే ఉంటాయి. ముఖ్యంగా అనుకోని ఖర్చులు చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ బడ్జెట్‌ సిద్ధం చేయడానికి ప్రయత్నించండి. తగిన బడ్జెట్‌ను సిద్ధం చేసుకోకపోతే మీ నగదు ప్రవాహాలను నియంత్రించలేరు. బడ్జెట్‌.. మీకు ఎంత డబ్బు వస్తోంది? ఆ నిధులు ఎలా ఖర్చు చేయాలో చూపిస్తుంది. మీ ఖర్చులను వర్గీకరించండి. అత్యవసర అవసరాలు, లగ్జరీ, నివారించదగినవి.. ఈ విధంగా ఖర్చుల పూర్తి జాబితాను తయారు చేసుకోండి. దీనివల్ల దేనికి ముందుగా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. పరిమిత వనరులు, అపరిమిత కోరికలు చాలా మందికి ఉంటాయి. కానీ మీరు మీ వనరులను సరిగ్గా నిర్వహించాలి. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే నివారించదగిన ఖర్చుల పట్ల మీరు అంత మెరుగ్గా నియంత్రించుకోగలుగుతారు. సరిగ్గా ప్లాన్‌ చేస్తే కొంత డబ్బును వినోదం, విశ్రాంతి కోసం కేటాయించొచ్చు.

ఆదాయ మార్గాలు
చాలా మంది ఉద్యోగాలు, బిజినెస్ లు చేస్తుంటారు. ఉద్యోగాలు చేసే వాళ్లు దాని మీదే ఆధారపడకుండా సెకండ్ ఇన్ కమ్ వచ్చే విధంగా చూసుకోవాలి. బిజినెస్ చేసే వాళ్లయినా సరే ఒక్క దానిపై పెట్టుబడులు పెట్టకుండా పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడులు పెడితే కొంత కాలం తర్వాత స్థిర ఆదాయం అందుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆస్తులు ఉంటాయి. అవి వాహనం, ఇల్లు, సేవింగ్స్‌ ఖాతాలో డబ్బులు ఏమైనా కావచ్చు. సమయం వచ్చినప్పుడు మీ అనంతరం వీటిని ఏం చేయాలో నిర్ణయించడం మీ బాధ్యత. సరైనా పద్ధతిలో ఆస్తుల కేటాయింపులు జరిగేలా బతికి ఉండగానే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎస్టేట్‌ ప్లానింగ్‌ అనేది సంపన్నులకు మాత్రమే అని చాలామంది భావిస్తారు. కానీ, వాస్తవం కాదు. మీరు ఆస్తులను కూడబెట్టుకోవడం ప్రారంభించిన వెంటనే ఎస్టేట్‌ ప్లానింగ్‌ను ప్రారంభించవచ్చు. అందుకు ఎక్స్​ పీరియన్స ఉన్న లాయర్ ను సంప్రదించవచ్చు.

ఖర్చులు
ఆదాయంలో ఎక్కువ భాగం అద్దె, లోన్ ఈఎంఐ, కిరాణా సామాగ్రి, చందాలు, ఇంటి మరమ్మతులు, ప్రయాణం, వినోదం వంచి ఖర్చుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. వ్యయాన్ని నిర్వహించగలగడం అనేది వ్యక్తిగత ఫైనాన్స్‌లో కీలకమైన అంశం. వ్యక్తిగత ఫైనాన్స్ సరైన నిర్వహణ కోసం ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయడం అవసరం. లేకుంటే, అది అప్పులను పెంచుతుంది.

రక్షణ
రక్షణ అంటే కొంత పొదుపును పక్కన పెట్టడం, ఇది ప్రమాదాలు లేదా అనారోగ్యం వంటి ఊహించని సంఘటనల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. రక్షణ ప్రణాళికలలో బీమా, రిటర్న్‌ని అందించే అత్యవసర నిధులు, మీరు ఎప్పుడైనా డబ్బు తీసుకోవడానికి పదవీ విరమణ కోసం పెన్షన్ ప్లాన్‌లు ఉంటాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు
పొదుపు మొత్తాన్ని ఖాళీగా ఉండకుండా అది పెరిగే ప్రదేశంలో ఉంచాలి. డబ్బు పెరిగినప్పుడు, అది కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి కొనుగోలు శక్తిని పెంచుతుంది. పెట్టుబడులు డబ్బు పెరగడానికి, సంపద సృష్టించడానికి సహాయపడతాయి. స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లు మొదలైన వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల డబ్బుపై రాబడిని పొందడంతోపాటు ప్రధాన పెట్టుబడి మొత్తం కంటే సంపదను పెంచుకోవచ్చు. అయితే, మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొన్ని ప్రమాదకర పెట్టుబడులలో కొన్నిసార్లు నష్టాలు ఉండవచ్చు.