ఒకటో తారీఖున జీతం పడిందా లేదా అని కాకుండా..
విద్యార్థులకు 70 శాతం మార్కులెందుకు రావడం లేదో చూడండి.. బాధ్యతతో బోధించండి
గన్నవరం బాలికల హైస్కూల్ ఉపాధ్యాయులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్
గన్నవరం, జూన్ 1: ”విద్యార్థులు బడికి వస్తున్నారు. ఉపాధ్యాయులు వచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. ఒకటో తారీఖున జీతం పడిందా లేదా అని కాకుండా విద్యార్థికి 70శాతం మార్కులు ఎందుకు రావడం లేదనే ఆలోచన చేయండి. అదే మీ పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు.
40 శాతం మార్కులు వచ్చిన వారికి మీకు కంపెనీ ఉంటే ఉద్యోగం ఇస్తారా?” అని గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ప్రశ్నించారు. హైస్కూళ్ల పరిశీలనలో భాగంగా గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి హైస్కూల్‌ను శనివారం ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీ చేశారు. తొలుత గన్నవరం బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. అక్కడ ఉపాధ్యాయు లతో మాట్లాడారు.
పదో తరగతిలో 70శాతం మార్కులు ఎంతమందికి వచ్చాయని ఉపాధ్యాయులను అడిగారు. దీనిపై కొందరు ఉపాధ్యా యులు మొత్తం పర్సంటేజ్ చెప్పారు. దీనిపై ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ బాధ్యత లేదు.
బాధ్యతతో విద్యార్థులకు బోధన చేయడం లేదనడంతో డీఈవో తాహెరా సుల్తానా సమాధానం చెప్పబోయారు. నేనేమీ చిన్న పిల్లోడిని కాదు. ఐఏఎస్ ర్యాంకర్‌ని. మీరు చెప్పే సమాధానం ఆఫీసులో కూర్చుని కూడా తెలుసుకోగలనన్నారు.
పదో తరగతిలో రిజల్ట్ కావాలని పదేపదే చెబుతున్నా పట్టడం లేదని, ఫౌండేషన్ సరిగా లేని విద్యార్థికి ఆరో తరగతి నుంచే బేసిక్స్ నేర్పుతూ వస్తే రిజల్ట్ ఇలా ఉం టుందా అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా 70శాతం మార్కులు తక్కువ మందికి రావటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంను పరిశీలించి కొలతలు వేశారు. సరిపడా వచ్చిందా రాలేదా అని ఎంఈవోలను అడిగారు.
ఎంత మందికి ఎంత అవసరమని అడగితే సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవోలు కె.రవికుమార్, ఆర్.కమల కుమారి, హెచ్‌ఎం డి.ఝాన్సీరాణి పాల్గొన్నారు. తర్వాత గొల్లనపల్లి హైస్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడారు. హెచ్‌ఎం కేఎస్ జగదీ శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.