దొంగల్లా వచ్చి.. సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు

అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలు ఎవరికీ కనిపించకుండా దొంగల్లా వచ్చి హాజరుపట్టీలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన సభ్యులకు ఇలా దొంగచాటుగా సంతకాలు పెట్టాల్సిన ఖర్మ ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. సంతకాలు చేసి సభకు రాకుండా ముఖం చాటేయటం వారి గౌరవాన్ని తగ్గిస్తుందే తప్ప.. ఏ మాత్రమూ పెంచదని పేర్కొన్నారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శంగా నిలవాలే కానీ తలవంపులు తెచ్చేలా ప్రవర్తించొద్దని సూచించారు. సభకు హాజరై తమ సమస్యలపై మాట్లాడాలనే ప్రజలు వారిని ఎన్నుకున్నారు తప్ప.. ఎవరికీ కనిపించకుండా హాజరుపట్టీలో సంతకాలు చేసి వెళ్లిపోవటానికి కాదని అన్నారు. ఇప్పటికైనా వారంతా గౌరవంగా సభకు రావాలని పిలుపునిచ్చారు.


నాకు కనిపించలేదు.. మీకు కనిపించారా?
‘వైకాపా ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్ష, మత్స్యరాశ విశ్వేశ్వరరాజు, ఆకేపాటి ఆమర్‌నాథ్‌రెడ్డి, దాసరి సుధ హాజరుపట్టీల్లో సంతకాలు పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. గత నెల 24న గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత నుంచి వీరంతా వేర్వేరు తేదీల్లో సంతకాలు పెట్టారు. వారెవరూ సభలో నాకు కనిపించలేదు. మీకెవరికైనా కనిపించారా?’ అని సభాపతి సభ్యుల్ని ప్రశ్నించారు. కర్నూలులో గ్రీన్‌ కో ప్రాజెక్ట్‌కు సంబంధించి వైకాపా ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, బి.విరూపాక్షిలు లిఖితపూర్వకంగా పంపించిన ప్రశ్న.. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకొచ్చింది. అయితే ఆ పార్టీ సభ్యులెవరూ సభకు హాజరుకాకపోవటాన్ని ప్రస్తావిస్తూ సభాపతి మాట్లాడారు. ‘వైకాపా సభ్యులు లిఖితపూర్వకంగా ప్రశ్నలను సభకు పంపిస్తున్నారే తప్ప.. ఆ ప్రశ్నలు అడగటానికి సభలో ఉండట్లేదు. అసలు వారు సభకే రావట్లేదు. దీని వల్ల ఈ సమావేశాల్లో 25 ప్రశ్నలకు సభలో సమాధానాలు లభించలేదు. అంతేకాకుండా మరికొందరు సభ్యులు ప్రశ్నలు అడిగే, వాటిపై మాట్లాడే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం’ అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఎథిక్స్‌ కమిటీకి పంపిద్దాం
‘వైకాపా సభ్యులు సభకు రాకుండా హాజరుపట్టీలో సంతకాలు పెట్టటం ఒక తప్పయితే.. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ సభకు గైర్హాజరవటం మరో తప్పు. జగన్‌మోహన్‌రెడ్డి మినహా వైకాపా సభ్యులందరూ ప్రతి నెలా వేతనాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుంటూ డ్యూటీకి రాని వారిని ఏమనాలి? ప్రభుత్వ ఉద్యోగాలు ఇలాగే విధులకు రాకపోతే వారిని ఏం చేస్తాం?’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. సస్పెండ్‌ చేస్తాం.. అంటూ సభ్యులు సమాధానమిచ్చారు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా సభ్యుల వ్యవహారాన్ని ఎథిక్స్‌ కమిటీకి పంపించాలని కోరారు. నిబంధనలన్నీ పరిశీలించి, అనుమతిస్తే ఎథిక్స్‌ కమిటీకి పంపించి కఠిన చర్యలు తీసుకుందామని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

‘వైకాపా ఎమ్మెల్యేలు 11 మంది ఫిబ్రవరి 24న సభకు వచ్చినట్లు హాజరుపట్టీలో సంతకాలు పెట్టారు. 25న ఐదుగురు, ఈ నెల 18న ఒకరు, 19న నలుగురు సభకు హాజరైనట్లుగా సంతకాలు చేశారు. సభ లోపల వారెక్కడా కనిపించలేదు. వారిని మీరు రానివ్వలేదోమోనని నా అనుమానం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు. దానికి సభాపతి స్పందిస్తూ గురువారం మధ్యాహ్నం సభలో మరోసారి మాట్లాడారు.