వ్యాయామం మన ఆయుర్దాయాన్ని ఎలా పెంచుతుందో ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్ చోప్రా వివరించారు.
ఆరోగ్యంగా జీవించడానికి, ఆయుష్షు పెంచుకోవడానికి వ్యాయామం అత్యంత శక్తిమంతమైన ఔషధమని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్ చోప్రా కూడా ఈ విషయాన్ని బలంగా నొక్కి చెప్పారు. వ్యాయామం మన ఆయుర్దాయాన్ని ఎలా పెంచుతుందో ఆయన వివరించారు.
వ్యాయామం = ఎక్కువ కాలం జీవితం
డాక్టర్ చోప్రా తన సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాయామాన్ని “దీర్ఘాయువు కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఔషధం”గా అభివర్ణించారు. “రోజుకు కేవలం 90 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల చావు ముప్పు 15% తగ్గుతుంది. అంతేకాదు.. మీరు దాదాపు పది సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
శరీరానికి అస్సలు కదలిక లేకపోవడం (Inactivity) ధూమపానం (Smoking) కంటే కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. శారీరక శ్రమ వల్ల రక్తనాళాలు, గుండె, శ్వాస వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగుపడుతుందని, ఇది చావు ముప్పును గణనీయంగా తగ్గిస్తుందని ఆయన వివరించారు.
ఏ వ్యాయామం ఉత్తమం?
మరి ఇంతకీ ఏ వ్యాయామం చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది. దీనికి సమాధానంగా, డాక్టర్ చోప్రా పుల్-అప్ బార్‌కు వేలాడటం (Dead-hanging pulls) ఉత్తమమైన వ్యాయామంగా సూచించారు. “పురుషులు రెండు నిమిషాలు, మహిళలు 90 సెకన్లు ఈ వ్యాయామం చేయాలి. శక్తి శిక్షణ (Strength training) అనేది మన భవిష్యత్తు కోసం చేసే ఒక పొదుపు ప్రణాళిక లాంటిది” అని ఆయన ఉద్ఘాటించారు.
గ్రిప్ స్ట్రెంత్ (Grip Strength) ఎందుకు ముఖ్యం?
వ్యాయామం వల్ల శారీరక ప్రయోజనాలతో పాటు, అది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని డాక్టర్ చోప్రా తెలిపారు. మనం వ్యాయామం చేసినప్పుడు శరీరం కొంత ఒత్తిడికి గురై, దాన్ని తట్టుకునేందుకు సిద్ధమవుతుందని, ఆ తర్వాత అది సాధారణ స్థితికి వస్తుందని ఆయన వివరించారు. ఇది మనసును కూడా గట్టిపరుస్తుందని, జీవితంలో పెద్ద ఒత్తిళ్లు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునే శక్తిని ఇస్తుందని చెప్పారు.
అన్ని రకాల వ్యాయామాలకు గ్రిప్ స్ట్రెంత్ చాలా ముఖ్యమని, ఇది మన మొత్తం బలానికి అద్దం పడుతుందని డాక్టర్ చోప్రా పేర్కొన్నారు. “పుల్-అప్స్ చేయడం గ్రిప్ స్ట్రెంత్‌ను పెంచడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. వేలాడటం, లాగడం, మళ్లీ చేయడం.. ఇది సరళమైనది, శక్తిమంతమైనది. గ్రిప్ స్ట్రెంత్ అన్ని వయసుల వారికి ముఖ్యం. ఇది కాళ్ళు, గ్లూట్స్ కండరాలకు కూడా సహాయపడుతుంది. గోల్ఫ్ ఆడటం, వస్తువులను పట్టుకోవడం, బరువులు మోయడం వంటి ప్రతి శారీరక కార్యకలాపానికి గ్రిప్ అవసరం” అని ఆయన పేర్కొన్నారు.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్యపరమైన సలహాకు ఇది ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి సందేహాలుంటే మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.)
































