సాధారణంగా చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు. పొద్దున్నే ప్లేట్ లో ఉప్మా పెడితే కడుపు మాడ్చుకొని అయినా ఉంటారు కానీ ఉప్మా మాత్రం తినరు కొందరు. అయితే ఉప్మాని సరైన రీతిలో చేస్తే దీనిని మించిన టేస్ట్ మరే ఇతర అల్పాహారానికి రాదు.
ఉప్మాని అనేక రకాలుగా చేయవచ్చు. అందులో రాగి పిండితో చేసే ఉప్మా ఒకటి. రాగి ఉప్మా అనేది ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం. ఉప్మా అంటే మొఖం తిప్పుకునేవాళ్లు కూడా దీనిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే రోజూ ఇదే కావాలని అడుగుతారు. అన్ని వయస్సుల వారికి ఇది నచ్చుతుంది. రాగి ఉప్మా ఎలా చేసుకోవాలి,దీనిని తయారుచేయడానికి కావలసిన పదార్థాలు గురించి ఇక్కడ చూడండి.
రాగి ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
రాగి రవ్వ: 1 కప్పు
నీరు: 3 కప్పులు
ఆవాలు: 1/2 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
శనగపప్పు: 1 టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగ పప్పు: 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
అల్లం: 1 టీస్పూన్
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
రాగి ఉప్మా తయారీ విధానం
-ముందుగా రాగి రవ్వను కడిగి కొన్ని నిమిషాలు నానబెట్టండి. అనంతరం నీటిని పూర్తిగా తీసేసి పక్కన పెట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించండి.
-పప్పులు రంగు మారిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి వేయించండి. రాగి రవ్వను బాగా వేయించడం వల్ల ఉప్మా ఉండలు కట్టకుండా ఉంటుంది.
-ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చాక నానబెట్టిన రాగి రవ్వను వేసి కొన్ని నిమిషాలు వేయించండి.
-ఇప్పుడు నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-మంటను తగ్గించి మూత పెట్టి రాగి ఉప్మాను ఉడికించండి.
-రాగి ఉప్మా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రాగి ఉప్మా రెడీ. దీనిని చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ తింటే సూపర్.
-ఇది పిల్లలకు,పెద్దలకు కూడా మంచి అల్పాహారం. వేరుశనగ పప్పులు కావాలనుకుంటే నూనెలో వేయించి ఉప్మా పైన చల్లుకోవచ్చు.
-రాగి ఉప్మాను మరింత రుచికరంగా చేయడానికి, మీకు ఇష్టమైన కూరగాయలను కూడా వేసుకోవచ్చు.
విరిగిన ఎముకల్ని అతికించి,నడవలేనోళ్లను కూడా పరిగెత్తించే పచ్చడి..ఎలా చేయాలంటే
రాగి ఉప్మా ప్రయోజనాలు
రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.రాగుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. రాగుల్లోని పోషకాలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రాగి ఉప్మాను ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి డిన్నర్ గా కూడా తీసుకోవచ్చు.