ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్న బార్లీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బార్లీ నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది సహజ సిద్ధమైన పానీయం..
అయితే.. పలు సమస్యలను నివారించేందుకు ఈ పానీయాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని రెగ్యులర్ గా తాగొచ్చు.. బార్లీ గింజలు చూసేందుకు గోధుమల్లాగే ఉన్నా, వాటికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..బార్లీ నీటిలో.. విటమిన్ బి కాంప్లెక్స్, ముఖ్యంగా B6, B12 వంటి విటమిన్లు ఉంటాయి. ఇంకా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందుకే.. ఈ నీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బార్లీ నీటిని క్రమం తప్పకుండా తాగడం వలన శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది పెద్ద పేగును శుభ్రపరుస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు బార్లీ నీటిని తాగడం వల్ల వేడి తగ్గుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని నిత్యం తాగితే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోన్లు ఇట్టే కరిగిపోతాయి. బార్లీ గింజల నీటికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే నిత్యం బార్లీ నీటిని తాగాలి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మూత్రాశయ సమస్యలు కూడా బార్లీ నీటిని తాగడం వల్ల తగ్గుతాయి.
బరువు తగ్గుతుంది..
అధిక బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని నిత్యం ఉదయం, సాయంత్రం తాగాలి. ఇది శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. బార్లీలో బీటా గ్లూకాన్ అనే పదార్థం శరీరంలో ఉండే హానికరమైన విష పదార్థాలను, వ్యర్థాలను విసర్జన క్రియ ద్వారా బయటకు పంపిస్తుంది. పేగుల్ని శుభ్రపరచడంతో పాటు పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. బార్లీ నీటిని తీసుకోవడం వల్ల మెరుగైన రక్త ప్రవాహంతో థ్రాంబోసిస్, హృదయ సంబంధ వ్యాధులు నివారించవచ్చు.
బార్లీలోని ట్రిప్టోఫాన్ జీవక్రియ హృదయ సంబంధ రోగులకు తగిన చికిత్సలను అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ బార్లీ నీరు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బార్లీ నీటిని ఎలా తయారు చేయాలి..
బార్లీ నీటిని తయారు చేసుకోవడానికి, గుప్పెడు బార్లీ గింజలను ఒక లీటరు నీటిలో వేసి 10 నుంచి 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఆ తర్వాత నీటిని చల్లార్చి, గింజలను వడకట్టాలి. ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని నిత్యం తాగితే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా పొడిగా కూడా చేసుకుని.. నీటిలో కలుపుకొని తాగొచ్చు..
































