పోలీసుకు అలా ముసుగువేసి అలా నిందితుడిలా నిలబెట్టారు. ఆయన ఏం చేశాడు..? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. ఆయన అసలు పోలీసాయన కాదు.
నకిలీ పోలీస్. మాంచిగా ఇస్త్రీ చేసిన పోలీస్ యూనిఫాం వేసుకుని.. చేతిలో వాకీ టాకీ పట్టుకుని.. రోజు ఓ సెంటర్ దగ్గర కాపు కాసి వసూళ్లకు తెగబడుతున్నాడు. ఈ విషయం అసలు ఖాకీలకు తెలిసింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని నకిలీ పోలీస్ డ్రామాను రట్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బద్వేలుకు చెందిన మాడపూరు శివయ్య.. నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడు. విద్యానగర్‌కు వెళ్లే దారిలో ఇతను బైక్స్, కార్లు ఆపి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారం పోలీసులకు రావడంతో టౌన్ ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటన స్ధలానికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా నిందితుడ్ని పట్టుకున్నారు. పోలీసు యూనిఫాంలో ఉన్న నకిలీ పోలీసు.. స్థానిక పోలీసులను చూసి పారిపోయేందుకు ట్రై చేశాడు. పోలీసులు చాకచక్యంగా పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసు శాఖతో అతనికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాదండోయ్. రాజంపేట టౌన్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నానని చీట్ చేసి.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పట్టణంలో అప్పుడప్పుడు ఖాకీ వేషంలో ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్నాడు. శివయ్య నుంచి పోలీసు యూనిఫాం, పోలీసు శాఖకు సంబంధించిన నేమ్‌ప్లేట్, ఫేక్ ఐడీ, చార్జర్, వాకీటాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.