పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ, రోజూ నడిచే సాధారణ బస్సులకు అదనంగా 8,432 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే జనమంతా పల్లె బాట పడుతుంటారు. దీంతో నగరాల నుంచి లక్షల మంది ప్రజలు బస్సుల్లో సొంత ఊరికి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఏ బస్సు చూసిన రద్దీగానే ఉంటుంది. అయితే ప్రయాణ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడవద్దని ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని అదనపు బస్సు సర్వీసులను కూడా అందించేందుకు చర్చలు తీసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం…
తెలుగువారి అతిపెద్ద పండుగగా భావించే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) విస్తృత స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ, రోజూ నడిచే సాధారణ బస్సులకు అదనంగా 8,432 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
సంక్రాంతి సమయంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల మధ్య ప్రయాణాలు ఎక్కువగా ఉండటంతో ఈసారి ప్రత్యేక బస్సుల ప్రణాళికను మరింత విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా స్త్రీశక్తి పథకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సుమారు 71 శాతం బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య నడపాలని నిర్ణయించారు. గ్రామాలు–మండలాలు, మండలాలు–పట్టణాల మధ్య రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దాదాపు 6 వేల ప్రత్యేక బస్సులను ఈ మార్గాల్లో అందుబాటులో ఉంచారు.
పండుగకు ముందు నగరాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులే కాకుండా, పండుగ అనంతరం తిరిగి ఉద్యోగాలు, విద్యా అవసరాల కోసం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు చేరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఈ దృష్ట్యా రెండు వైపులా ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు కౌంటర్లు, సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం రాష్ట్రం బయట లేదా నగరాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ ఆనందాలను పంచుకునేందుకు స్వగ్రామాలకు తరలివస్తారు. ఈ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా తనిఖీలు చేపట్టామని, డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక బస్సుల వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లతో సంక్రాంతి ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.


































