విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణను మరిచి చితకబాదుతున్నాడని,పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తో పాటు మధ్యాహ్న భోజన సిబ్బందిని, అటెండర్ ను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి పంపించేయాలని కోరుతూ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన సంఘటన గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్ రాజయ్య గత ఐదు నెలల క్రితం బదిలీపై మైలారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కు రావడం జరిగిందని విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తరగతి గదిలో నిద్రపోతూ, పాఠాలు చెప్పాలని విద్యార్థులు అడిగితే విచక్షణారహితంగా చితకబాదుతున్నాడని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన సిబ్బందిని, అటెండర్ ను ప్రధానోపాధ్యాయుడి నీ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రామ్ రాజయ్య తరగతి గదిలో నిద్రపోయే ఫోటోలు, టేబుల్ పై కాళ్లు పెట్టి నిద్రపోతున్న ఫోటోలు గ్రామస్తులు మీడియా ముఖంగా చూపించి ఈ సార్ ను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని వేడుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు జి శ్రీనివాస్ ను వివరణ కోరగా రామ్ రాజయ్య తనకు వాట్సప్ లో రివాల్వర్ ఫోటో , రివాల్వర్ కావాలని కోరుతూ అధికారులకు పెట్టుకున్న దరఖాస్తు తో పాటు గతంలో ఎంఈఓ లు, కలెక్టర్ తదితర ఉన్నతాధికారులపై చేసిన ఫిర్యాదులు, ప్రచురితమైన వార్తాపత్రికల కటింగ్స్ తనకు పంపించి బెదిరిస్తున్నారని తెలిపారు.
ఈ విషయంపై ఉపాధ్యాయుడు రామ్ రాజయ్య వివరణ కోరగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో కనీసం మంచినీటి సదుపాయం లేదని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదని, పరిసరాల పరిశుభ్రత ఉండడం లేదని , మిగతా ఉపాధ్యాయులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదని తాను ప్రశ్నించినందుకు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం మూలంగా కావాలని తనపై లేనిపోని ఆరోపణలు చేసి గ్రామస్తుల సహకారంతో ధర్నా నిర్వహించి తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు సత్యం కాదని తెలిపారు. తాను ప్రశ్నించే గొంతుకని ఏడాదికి ఒక ట్రాన్స్ఫర్ తనకు తప్పదని తాను తప్పు జరిగితే ప్రశ్నిస్తానని గొప్పగా చెప్పుకున్నారు. రివాల్వర్ ఉన్నదా అని అడిగితే తనకు ప్రాణహాని ఉన్నదని గతంలో పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నానని, అది పోలీస్ శాఖను అడిగి తెలుసుకోవాలని దాటవేశారు.