Thota Trimurtulu : శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష – 2 లక్షల జరిమానా

18 Months Jail For Thota trimurtulu : వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష , రెండు లక్షల జరిమానా విధించింది.


దళితులకు శిరోముండనం కేసులో 27 ఏళ్లకుపైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో వైసిపి ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. త్రిమూర్తులతో పాటు నిందితులుగా ఉన్న మరో 9 మందిని కూడా శిక్, విధించారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. ఐదుగుర్ని హింసించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. గత ఏడేళ్లుగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. తుది తీర్పు 2018లోనే రావాల్సి ఉంది. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. అప్పట్లోగా ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు బాధితులు ఎస్సీలు కాదని ఫిర్యాదులు ఇప్పించి వారికి పత్రాలు అందకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి హైకోర్టు వారికి కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. అన్ని విచారణలు పూర్తవడంతో.. తోట త్రిమూర్తులు తప్పు చేశాడని నిర్ధారించి కోర్టు శిక్ష విధించింది.

ప్రధాన సాక్షి కోటి రాజు కొద్ది రోజుల కిందట మృతిచెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. బాధితులు ఐదుగురిలో ఇద్దరు మరణించారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతిచెందారు. 15 మంది సాక్షుల్లో ఇద్దరు చనిపోయారు. శిరోముండనం కేసు నమోదై ఇప్పటికీ 28 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వారికి న్యాయం లభించింది.

తోట త్రిమూర్తులు రకరకాల పార్టీలు మారారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి పొందారు.